MP అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న KCR

MP అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న KCR

లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్. సిట్టింగ్ ఎంపీలున్న సీట్లు మినహా మిగతా నియోజక వర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లకే టికెట్ కేటాయించిన కేసీఆర్ …లోక్ సభఎన్నికల్లో కూడా వారికే ఇస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది.

అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుతున్న గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ …పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. 16MPలను క్లీన్ స్వీప్ చేస్తామంటున్న కేసీఆర్…ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సిట్టింగ్ లు లేని నియోజక వర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగానే లోక్ సభ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తారని చర్చ జరుగుతున్నా….అందరికి టికెట్ లు దక్కుతాయా లేక.. పని తీరును బట్టి టికెట్లు వస్తాయా అనేది డౌట్ గా ఉంది. అయితే కొంత మంది సిట్టింగ్ ల మీద కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిపి టీఆర్ఎస్ కు మొత్తం 14 మంది లోక్ సభ సభ్యులున్నారు. చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ లోక్ సభస్థానాల్లో టీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలు లేరు. ఈ ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేశాక కేసీఆర్… మిగతా వాటిపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తుంది.

మల్కాజ్ గిరి స్థానంలో సిట్టింగ్ ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికకావటంతో అక్కడ కొత్త వారికి టికెట్ కేటాయించాల్సి ఉంది. GHMC మేయర్ బొంతు రాంమోహన్, మాజీ మంత్రి వేణుగోపాలచారీ, మాజీ సీఎస్ రాజీవ్ శర్మల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ లోక్ సభ స్థానంలో సిట్టింగ్ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీకి ఆసక్తిగా లేనట్టు సమాచారం. అయితే కేసీఆర్ ఆదేశిస్తే తప్పదనే భావన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని గులాబీ బాస్ కేసీఆర్… ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొత్తవాళ్ళకన్నా.. సీనియర్ నేతలకు ఇస్తేనే విజయం సాధించ వచ్చిన కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక్కడి నుంచి ఎవరికి టికెట్టు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక హాట్ సీట్  సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దండే విఠల్, సికింద్రాబాద్ ఇంచార్జీ బండి రమేష్ లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీల నుంచి సీనియర్లే ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారు కాబట్టి టీఆర్ఎస్ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇప్పటికే కొంత మందికి నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజక వర్గంలో మాజీ మంత్రి రాములు ఇందులో ఫస్ట్ ఉన్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేలు కూడా రాములుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ స్థానంలో మళ్లీ బోయిని పల్లి వినోద్ కుమార్ కే టికెట్టు ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో  కేసీఆర్ స్పష్టం చేసారు. పెద్దపల్లి నియోజక వర్గంనుంచి ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీ కల్వకుంట్ల కవితకే టికెట్ కేటాయించే అవకాశం ఉంది.

ఇక కొంత మంది సిట్టింగ్ లకు టికెట్ లు ఇవ్వరనే టాక్ వినిపిస్తుంది. జహిరాబాద్ లో సిట్టింగ్ బీబీ పాటిల్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఆదిలాబాద్ ఎంపీ నాగేష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు టికెట్ దక్కవనే చర్చ జరుగుతోంది. వరంగల్ నుంచి కడియం శ్రీహరి, ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి టికెట్ ఇయ్యాలి అనేది పూర్తిగా కేసీఆరే పైనల్ చేయనున్నారు. ఫిబ్రవరి చివరికల్లా ఒక దఫా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.