సీఎం తీరు వెనుక ఏదో కుట్ర :డీఎస్

సీఎం తీరు వెనుక ఏదో కుట్ర :డీఎస్
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై గుండె రగులుతోంది
  • సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది
  • కార్మికుల్లో తెలంగాణ శౌర్యం కనిపిస్తోంది
  • చర్చలతో వివాదానికి ముగింపు పలకండి
  • సీఎం కేసీఆర్​కు టీఆర్ఎస్​ ఎంపీ డీఎస్​ లేఖ

హైదరాబాద్, వెలుగు:  ‘‘ఆర్టీసీ విషయంలో పంతాలకు, పట్టింపులకు పోవద్దు. కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకండి” అని సీఎం కేసీఆర్​ను టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఈ మేరకు కేసీఆర్​కు ఆయన లేఖ రాశారు. కార్మికులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రతపై భరోసా కల్పించి, వారి సమస్యలను పరిష్కరిస్తే అందరూ హర్షిస్తారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆర్టీసీని ప్రైవేటీకరణ వెనుక ఆర్థిక కోణాలు దాగున్నాయనే ఆరోపణలకు కూడా తెరపడుతుందని పేర్కొన్నారు. సమ్మెకు ముగింపు పలికి ప్రజా రవాణాను మెరుగు పరిచేందుకు కేసీఆర్ తీసుకునే హేతుబద్ధమైన నిర్ణయాలకు ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోంది..

నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని డీఎస్ పేర్కొన్నారు. కార్మికుల పోరాట పటిమను చూస్తుంటే ‘లక్ష్యసాధనలో ఎప్పుడూ శృతి మించకు.. ఎవరికీ తలవంచకు’ అన్న స్ఫూర్తి కనిపిస్తోందన్నారు. ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే పరిస్థితుల్లో కూడా కార్మికులకు వారి కుటుంబాలు అండగా ఉంటున్నాయని, వారి తీరులో దశాబ్దాల తెలంగాణ మట్టిలోని ధైర్యం పరిమళిస్తోందని చెప్పారు. 48 వేల మంది కార్మికుల మెడ మీద కత్తి పెట్టినా కనీసం ఒక్క శాతం కార్మికులు కూడా తలవంచక నిలబడిన ధైర్యంలో తెలంగాణ శౌర్యం కన్పిస్తోందని పేర్కొన్నారు.

మీకు తెలియనిదా?

ఏపీ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్​లో ఉన్న ఆర్టీసీ విభజన పూర్తికాకముందే, టీఎస్​ఆర్టీసీ సంస్థ అధికారికంగా మనుగడలోకి రాకముందే, సంస్థలో వాటా ఉన్న కేంద్రం నుంచి ఎలాంటి ఆమోదం లేకుండానే ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం సాధ్యం కాదనే విషయం తమ(కేసీఆర్)​కు తెలియంది కాదని డీఎస్ అన్నారు. హైకోర్టు చీఫ్​జస్టిస్ వ్యాఖ్యానించినట్లుగా ఉన్నతాధికారులు కేసీఆర్​కు తప్పుడు సమాచారం, అనుచిత సలహాలు ఇవ్వడం వల్లే ఈ పరిణామాలు తలెత్తినట్లు అనిపిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల స్వభావానికి విరుద్ధంగా ఇంత కఠినంగా కేసీఆర్ వ్యవహరించడం చూస్తుంటే ఎవరో కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. తెలంగాణ బిడ్డలు ఎవరికీ తలవంచరనే విషయం తమ(కేసీఆర్)కు తెలియంది కాదని, అయినప్పటికీ కార్మికులనే కాకుండా వారి కుటుంబాలను కూడా బెదిరించే దుస్సాహసానికి తమ ద్వారా పాల్పడ్డదెవరో అర్థం కావడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలకు బాధ్యులైన వారిపై గుండె రగులుతోందని అన్నారు. అన్నీ తెలిసిన కేసీఆర్ వివేచనతో ఓ కుటుంబ పెద్దలా ఆలోచించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.