గెలిచినవీ.. గెలవనివీ ‘కారు’ డిక్కీలోకే

గెలిచినవీ.. గెలవనివీ  ‘కారు’ డిక్కీలోకే

టీఆర్ఎస్ కు 9 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు

ఎక్స్​ అఫీషియోలు, ఇండిపెండెంట్లు, ప్రతిపక్ష పార్టీల సభ్యులతో పీఠాలు కైవసం

మున్సిపాలిటీల్లో 4  కాంగ్రెస్, 2 బీజేపీ, 2 ఎంఐఎంకు

నేరేడుచర్ల, మేడ్చల్​ చైర్​పర్సన్ల ఎన్నిక నేటికి వాయిదా

గెలిచినవి.. గెలవనివి.. అనే తేడా లేకుండా 9 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు టీఆర్​ఎస్​ ఖాతాలోకే  వెళ్లిపోయాయి. హంగ్  ఫలితం వెలువడ్డ చోట్లనే కాకుండా మెజార్టీ లేని ప్రాంతాల్లో కూడా ఆఖరి నిమిషంలో చక్రం తిప్పి చైర్​పర్సన్​, మేయర్​ పదవులను కారు కైవసం చేసుకుంది. పలు ప్రాంతాల్లో ఇండిపెండెంట్లను, ప్రతిపక్ష పార్టీల సభ్యులను తమ వైపు తిప్పుకుంది. ఎక్స్​ అఫీషియో సభ్యుల ఓట్లను అవకాశంగా మలుచుకుంది. ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎక్కువున్న చోట కూడా టీఆర్​ఎస్​ హవా చెలాయించింది. మొత్తంగా టీఆర్​ఎస్ 80 మున్సిపాలిటీల్లో పూర్తి మెజారిటీ సాధించగా.. ఎక్స్​ అఫీషియో ఓట్లు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్లు, ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకొని 110 టౌన్లను తన ఖాతాలో వేసుకుంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీల్లో మేయర్, చైర్​పర్సన్​ ఎన్నికలు జరిగాయి. అధికారపార్టీ అక్రమాలకు పాల్పడిందని అనేక చోట్ల ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్​లోనూ అత్యధిక డివిజన్లను టీఆర్​ఎస్సే గెలవడంతో ఆ మేయర్​ పీఠం కూడా దానికే దక్కనుంది.

మున్సిపాలిటీల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్​, రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల ఎంఐఎం చైర్​పర్సన్​ పీఠాలను దక్కించుకున్నాయి. రెండు మున్సిపాలిటీల చైర్​పర్సన్ల ఎన్నిక మంగళవారానికి వాయిదాపడ్డాయి. ఇందులో ఎక్స్ అఫీషియో ఓటు వివాదంతో నేరేడుచర్ల, కోరం లేక మేడ్చల్  చైర్​పర్సన్​ ఎన్నికలకు బ్రేక్‌‌‌‌ పడింది. అధికార పార్టీ వేసిన ఎత్తులతో.. తమకు మెజార్టీ ఉన్న చోట కూడా కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమవ్వాల్సి వచ్చింది. వడ్డేపల్లి, మణికొండ, తుర్కయాంజల్​, చండూర్ మున్సిపల్​ పీఠాలను కాంగ్రెస్ గెలుచుకోగా.. మక్తల్, ఆమన్‌‌‌‌గల్ మున్సిపల్ పీఠాలను బీజేపీ సాధించుకుంది. భైంసా, జల్‌‌‌‌పల్లిలో ఎంఐఎం అభ్యర్థులు చైర్​పర్సన్లుగా ఎన్నికయ్యారు.

పేరు గులాబీ ..ఊరు కాంగ్రెస్

రెండు చోట్ల కాంగ్రెస్  నుంచి గెలిచిన సభ్యులు.. గులాబీ కోటాలో చైర్​పర్సన్​, మేయర్​ పీఠాలను దక్కించుకున్నారు. బడంగ్​పేట్  మేయర్​ సీటును టీఆర్​ఎస్​ నాటకీయంగా కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్​ నుంచి కార్పొరేటర్​గా గెలిచిన చిగురింత పారిజాతరెడ్డిని ఆఖరినిమిషంలో పార్టీలో చేర్చుకొని మేయర్​ పీఠాన్ని టీఆర్​ఎస్​ ఖాతాలో వేసుకుంది. ఆదిభట్ల  మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులుంటే.. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ 6 వార్డులు, కాంగ్రెస్‌‌‌‌ 8 వార్డులు, బీజేపీ ఒక వార్డు గెలుచుకున్నాయి. సగానికి పైగా వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్​కు ఇక్కడి చైర్​పర్సన్​ పీఠం దక్కాలి. కానీ.. కొందరు కాంగ్రెస్‌‌‌‌ సభ్యులను టీఆర్​ఎస్ తమ వైపు తిప్పుకుంది. కాంగ్రెస్‌‌‌‌ నుంచి కౌన్సిలర్​గా గెలిచిన కొత్త హార్దిక ముందురోజే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్​ఎస్ లో చేరి చైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కూడా అధికార పార్టీ ఖాతాలో పడింది. కాంగ్రెస్​ గెలుపు సునాయసమనుకున్న పెద్ద అంబ‌‌‌‌ర్‌‌‌‌పేట్‌‌‌‌లో టీఆర్ఎస్ చైర్​పర్సన్​ సీటు దక్కించుకుంది.

ఎమ్మెల్సీలు న‌‌‌‌వీన్​రావు, ప‌‌‌‌ట్నం మ‌‌‌‌హేంద‌‌‌‌ర్​రెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల‌‌‌‌ను ఇక్కడ టీఆర్​ఎస్​ త‌‌‌‌మ వైపు తిప్పుకుంది. ప్రతిఫలంగా కాంగ్రెస్​కు వైస్ చైర్మన్‌‌‌‌ సీటిచ్చారు. ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ మామాఅల్లుళ్లు చంద్రారెడ్డి, బాల్ రెడ్డి రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. క్యాంపు రాజకీయాల్లో కాంగ్రెస్ మద్దతుతో బాల్​రెడ్డి చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకున్నారు. వైస్ చైర్మన్ సీటును కాంగ్రెస్ కు అప్పగించారు.

ఎక్స్​ అఫీషియో ఓట్లతో తారుమారు

బీజేపీ, కాంగ్రెస్​కు స్పష్టమైన మెజార్టీ ఉన్న మున్సిపాలిటీల్లో.. ఎక్స్​ అఫీషియో సభ్యుల ఓట్లతో ఫలితాలను టీఆర్​ఎస్ తన వైపు తిప్పుకుంది. తుక్కుగూడ‌‌‌‌లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించినా.. ఐదుగురు ఎక్స్ అఫీషియో మెంబ‌‌‌‌ర్ల ఓట్లతో టీఆర్​ఎస్ ఈ మున్సిపల్​ చైర్​పర్సన్​ సీటును ఖాతాలో వేసుకుంది. ఇక్కడ బీజేపీకి 9, టీఆర్​ఎస్​కు ఐదుగురు సభ్యులున్నారు. అయితే.. రాజ్యస‌‌‌‌భ స‌‌‌‌భ్యుడు కే.కేశ‌‌‌‌వ‌‌‌‌రావు, మంత్రి స‌‌‌‌బిత, ఎమ్మెల్సీలు నాయిని న‌‌‌‌ర్సింహారెడ్డి, యెగ్గ మ‌‌‌‌ల్లేశం, బోడ జ‌‌‌‌నార్దన్‌‌‌‌రెడ్డిల ఎక్స్​ అఫీషియో ఓట్ల(ఐదు ఓట్ల)తో టీఆర్​ఎస్​ అభ్యర్థి  చైర్​పర్సన్​ అయ్యారు. కాంగ్రెస్​కు మెజార్టీ బలమున్న యాదగిరిగుట్టను ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో టీఆర్​ఎస్​ చేజిక్కించుకుంది. ఇక్కడ చైర్​పర్సన్​ సీటుకు అవసరమైన 7 సీట్లు సాధించేందుకు టీఆర్​ఎస్​ ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దింపింది. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కర్నె ప్రభాకర్ ఓట్లతో పీఠాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్​ మెజార్టీ సాధించిన నల్గొండ మున్సిపాలిటీలో నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే ఓట్లతో.. హాలియా, చిట్యాలలో ఎమ్మెల్యే ఓట్లతో టీఆర్​ఎస్​ చైర్​పర్సన్​పదవులను రాబట్టుకుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలోనూ ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో  అధికార పార్టీ మేజిక్​ ఫిగర్​ను దక్కించుకుంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఓటేసినప్పటికీ సంఖ్యాబలం సరిపోక ఫలితం లేకుండా పోయింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, నారాయణపేట జిల్లా కోస్గిలోనూ ఎక్స్​ అఫీసియో సభ్యుల ఓట్లతోనే టీఆర్​ఎస్​ మున్సిపాలిటీలను దక్కించుకుంది. నార్సింగ్‌‌‌‌లో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌‌‌‌, ఎంపీ రంజిత్ రెడ్డి ఓట్లేశారు.

ఇండిపెండెంట్లతో..

అత్యధిక మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని ఆదిలాబాద్, ఖానాపూర్, నస్పూర్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ల సాయంతోనే టీఆర్​ఎస్​ చైర్​పర్సన్​ పదవులను దక్కించుకుంది. ఇండిపెండెంట్ల సహాయంతో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ గెలిచింది.  జనగామ మున్సిపాలిటీని ఇండిపెండెంట్ల మద్దతుతో గెలుచుకుంది.  నస్పూర్​లో  మేజిక్  ఫిగర్ 13 కాగా.. అక్కడ టీఆర్ఎస్​కు 10 వార్డులు వచ్చాయి. ముగ్గురు ఇండిపెండెంట్ల సహాయంతో ఆ పార్టీ పీఠం దక్కించుకుంది. ఆ ముగ్గురు ఇండిపెండెంట్లలో ఒకరికి వైస్ చైర్​పర్సన్​ పదవి ఇచ్చారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ల ఓట్ల సాయంతో టీఆర్ఎస్ పార్టీ చైర్​పర్సన్​, వైస్ చైర్​పర్సన్​ పదవులను దక్కించుకున్నది.

పొత్తు చిత్రాలు

మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీలు రకరకాల పొత్తులకు సిద్ధపడ్డాయి. మణికొండ మున్నిపాలిటీలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాలేదు. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఇక్కడి చైర్​పర్సన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్‌‌‌‌లోనూ పొత్తు కుదిరింది. అయితే మణికొండలో కాంగ్రెస్​కు బీజేపీ మద్దతు ఇస్తే… మక్తల్‌‌‌‌లో బీజేపీకి కాంగ్రెస్  మద్దతు ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి చైర్​పర్సన్​ అయ్యారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో ఎన్నికల ముందు కాంగ్రెస్​తో దోస్తీ కట్టిన సీపీఐ.. చైర్​పర్సన్​ ఎన్నిక సమయంలో టీఆర్​ఎస్​కు జై కొట్టి వైస్​ చైర్​పర్సన్​  సీటును దక్కించుకుంది.

దోస్తుతో నిజామాబాద్.. రెబల్స్తో రామగుండం
ఎంఐఎంతో నిజామాబాద్ కార్పొరేషన్ను, రెబల్స్తో రామగుండం కార్పొరేషన్ను టీఆర్ ఎస్ దక్కించుకుంది. నిజామాబాద్లో ఎక్కువ సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించగా.. ఎంఐఎం సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. రామగుండం కార్పొరేషన్ను తొమ్మిది మంది రెబల్స్తో చేజిక్కించుకుంది. ఇక్కడ రెబల్స్తో పాటు ఐదుగురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లను, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లను కూడా తమవైపు తిప్పుకుంది. గద్వాల జిల్లా అయిజ మున్సిపల్ చైర్పర్సన్ సీటును ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల సాయంతోనే టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.