ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఆకర్ష్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఆకర్ష్

మాజీ ఎంపీ కవిత గెలుపుకోసం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ఆరాటం

మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల్లోని నేతలకు గాలం

పోలింగ్​ టైం దగ్గరికొచ్చినా కొనసాగుతున్న చేరికలు

నిజామాబాద్​, కామారెడ్డి , వెలుగు: రేపు జరగనున్న నిజామాబాద్ ​లోకల్ ​బాడీస్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటం మాటేమోగానీ టీఆర్ఎస్​ఎమ్మెల్యేలకు ఆరాటం మాత్రం ఎక్కువైంది. తమ పార్టీకి ఫుల్​ మెజారిటీ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్​ కూతురు, మాజీ ఎంపీ కవితను ఎలాగైనా ఎమ్మెల్సీ చేయాలనే కసితో కొన్నాళ్లుగా ఆపరేషన్​ ఆకర్ష్​పైనే ఫోకస్​ పెట్టారు. అది ఏస్థాయిలో ఉందంటే ఎన్నికలకు ఒక్కరోజు గ్యాప్​లో కూడా పక్క పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను లాగి గులాబీ కండువా కప్పుతున్నారు.

ఫుల్ ​మెజారిటీ ఉన్నప్పటికీ..

నిజామాబాద్ ​లోకల్ ​బాడీస్​ ఎమ్మెల్సీ స్థానంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్​పార్టీ నుంచి గెలిచినవారు 494 మంది. అంటే సుమారు 60 శాతం రూలింగ్​ పార్టీకి చెందిన వారే. ఏ లెక్కన చూసినా టీఆర్ఎస్​ అభ్యర్థికే మెజారిటీ ఉంది. కానీ పార్టీ హైకమాండ్​ ఆదేశాల మేరకు మాజీ ఎంపీ కవితను ఎలాగైనా ఎమ్మెల్సీని చేయాలని ఆరాటపడుతున్న అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల నోటిఫికేషన్ ​విడుదల కాగానే ఆపరేషన్ ​ఆకర్ష్ కు తెరతీశారు. ఇందులో భాగంగా ఇందూరులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను నయానో, భయానో తమ పార్టీలోకి లాగుతూ వచ్చారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ​జరగబోతున్నా టీఆర్ఎస్​ ఆపరేషన్​ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకు నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మందిపైగా ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకొన్నారు.

ప్రలోభాలు, బెదిరింపులతో..

ఇందూరు లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ రేపు జరగనుంది.  ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్​వచ్చింది. ఏప్రిల్​లో పోలింగ్​​జరగాల్సి ఉండగా, కరోనాతో వాయిదా పడింది.  చివరకు ఈ నెల 9న నిర్వహించేందుకు ఎలక్షన్​ కమిషన్​గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచాయి. ఎమ్మెల్సీ పదవీ కాలం 15 నెలలే ఉన్నప్పటికీ టీఆర్ఎస్​తరఫున నిజామాబాద్​మాజీ ఎంపీ, సీఎం బిడ్డ కల్వకుంట్ల కవిత  పోటీలో ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యం  ఏర్పడింది. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కవిత, ప్రస్తుత బీజేపీ ఎంపీ అర్వింద్​ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్​తో మళ్లీ యాక్టివ్​ అయ్యారు.  గత ఓటమి నేపథ్యంలో హైకమాండ్​ ఆదేశాల మేరకు జిల్లా ఎమ్మెల్యేలు అలర్ట్​ అయ్యారు. టీఆర్ఎస్​కు పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ ఎందుకైనా మంచిదని  ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఆపరేషన్​ ఆకర్ష్​కు తెరతీశారు. ఎమ్మెల్యేలైతే ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి గెలిచిన  జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సుమారు 100 మందివరకు తమ పార్టీలోకి లాగారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​, నిజామాబాద్​ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్​ నియోజకవర్గాల్లో ఈ చేరికలు కొనసాగాయి. ఇందుకోసం ఎమ్మెల్యేలు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారనే వార్తలు వచ్చాయి. ఒకవైపు అభివృద్ధికి నిధులు, ఫ్యూచర్​పై భరోసా, ఇతరత్రా ప్రలోభాలతోపాటు వివిధ కేసులు, సమస్యలు ఉన్నవారిని  బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈక్రమంలో గడిచిన మార్చి నెలలోనే పదుల సంఖ్యలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కారెక్కారు. ఎన్నికలు వాయిదా పడడంతో చేరికలను టెంపరరీగా నిలిపివేసినా ఇటీవల పోలింగ్​ తేదీ ఖరారు కాగానే మళ్లీ స్టార్ట్​ చేసి, పోలింగ్​ ముందురోజు దాకా కొనసాగించారు.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

శుక్రవారం జరిగే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిజామాబాద్​ జిల్లా కలెక్టర్, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ సి. నారాయణ రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‍లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లోని 50 పోలింగ్​ కేంద్రాల్లో జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనుండగా,  24 మంది కోవిడ్ పాజిటివ్ ఓటర్లకు సాయంత్రం 4  నుంచి 5 గంటల మధ్య ఓటు చేసేందుకు చాన్స్​ ఇస్తామని చెప్పారు.