గులాబీ సొసైటీలు

గులాబీ సొసైటీలు

పీఏసీఎస్​ చైర్మన్​ ఎన్నికల్లో టీఆర్ఎస్​ మద్దతుదారుల హవా

అధికార పార్టీ లీడర్లకే 84 శాతం పీఠాలు

పలుచోట్ల నాటకీయ పరిణామాలు

దాడులు, లాఠీచార్జీలతో ఉద్రిక్తత

74 చోట్ల ఎన్నికలు వాయిదా

ఆఫీసర్ల తీరుపై విపక్షాల విమర్శలు

వెలుగు, నెట్​వర్క్: సొసైటీల పరిధిలో ఆదివారం ఉదయం నామినేషన్ల స్వీకరణ అనంతరం చేతులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్, వైస్​చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 74 పీఏసీఎస్​ల పరిధిలో  చైర్మన్, వైస్​చైర్మన్​ఎన్నికలను ఆఫీసర్లు వాయిదా వేశారు. తమ మద్దతుదారులు గెలిచే అవకాశముండడం వల్లే ఆయాచోట్ల టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, అధికారులతో కుట్రపన్ని కావాలని ఎన్నికలను వాయిదా వేయించారని కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు ఆరోపించారు.

ఆద్యంతం నాటకీయ పరిణామాలు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో మహాకూటమి తరఫున బరిలో దిగిన అభ్యర్థులు రాత్రికి రాత్రే కండువాలు మార్చి టీఆర్ఎస్​లో చేరి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న పోతుల మధుసూదన్ పీఏసీఎస్​ చైర్మన్​గా ఎన్నికయ్యారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్ పరిధిలో టీఆర్ఎస్​ ప్యానల్​ రెండు వర్గాలుగా చీలింది. ఒక వర్గంవారు కాంగ్రెస్ డైరెక్టర్ల సపోర్టు తో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు యత్నించారు. కానీ కోరం లేదంటూ ఎలక్షన్​ ఆఫీసర్​ నామినేషన్​ స్వీకరణకు ఒప్పుకోలేదు. అధికార సిబ్బందికి, సభ్యులకూ నడుమ గొడవ జరిగింది. ఎన్నికను నేటికి వాయిదా వేశారు.

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ నుంచి ముగ్గురు  ఆశించారు. డైరెక్టర్లు ఇంద్రాసేనారెడ్డికి మద్దతు ప్రకటించడంతో భంగపడిన కనకయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. మరో నేత శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు ఒంటిపై కిరోసిన్  పోసుకుని హంగామా చేశాడు.

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్​ పీఏసీఎస్​ చైర్మన్ పదవిని అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతుదారు కైవసం చేసుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్​ ప్యానల్​లో 8మంది, కాంగ్రెస్​ ప్యానల్​లో ఐదుగురు ఉన్నారు. కొందరు టీఆర్ఎస్​ సభ్యుల సహకారంతో కాంగ్రెస్​కు చెందిన దూది పాల నరేందర్ రెడ్డి చైర్మన్​ అయ్యారు.  కాంగ్రెస్​ మద్దతుదారుకు ఓటేసిన టీఆర్ఎస్​ డైరెక్టర్లపై ఆ పార్టీ​ లీడర్లు దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్​ పీఏసీఎస్​ ఐదో వార్డులో గండు అశోక్​ అనే డైరెక్టర్ శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. రెండో వార్డు నుంచి గెలిచిన మేరుగు రాజేశ్​ను చైర్మన్ చేయాలనే ఉద్దేశంతోనే అశోక్​ను కిడ్నాప్​ చేశారంటూ కుటుంబ సభ్యులు సొసైటీ ఆఫీస్​ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా, అశోక్​ కిడ్నాప్​ కాలేదని, ఎమ్మెల్యేతోనే ఉన్నాడని టీఆర్ఎస్​నాయకులు చెప్పడంతో విషయం అర్థమై, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారపార్టీ అనుకున్నట్లే రాజేశ్​ చైర్మన్​ అయ్యారు.

బెడిసికొట్టిన ఎమ్మెల్యే వ్యూహం

శనివారం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పీఏసీఎస్​లో టీఆర్ఎస్ ప్యానల్​నుంచి ఆరుగురు, కాంగ్రెస్ ప్యానల్​నుంచి ఏడుగురు  విజయం సాధించారు. రాత్రికిరాత్రే లోకల్​ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్​ మద్దతుదారు మోహన్ రెడ్డికి చైర్మన్ పదవి ఆశచూపి టీఆర్ఎస్​వైపు లాగారు. సీన్ కట్ చేస్తే ఆదివారం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ మద్దతుదారులు మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్​ మద్దతుదారులు, టీఆర్ఎస్ కు చెందిన మెరుగు శ్రీనివాస్ కు మద్దతు పలికారు. దీంతో మోహన్​రెడ్డి గొడవకు దిగగా, ఆఫీసర్లు ఎన్నిక వాయిదా వేశారు.  ​

ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలు

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ పీఏసీఎస్ లో కాంగ్రెస్​ ప్యానల్​ నుంచి ఏడుగురు, టీఆర్ఎస్ ​ప్యానల్​నుంచి ఆరుగురు గెలిచారు. కాంగ్రెస్​కు చైర్మన్​ పదవి దక్కకుండా ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సింగిల్ విండో కార్యాలయంలోకి చొచ్చుకుపోయారు. దీనిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ, ఆయన అనుచరులు అడ్డుకునే యత్నం చేశారు. కొందరు అధికారుల నుంచి ఎన్నికల పేపర్లను ఎత్తుకుపోయారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. తోపులాటలో ఎమ్మెల్యే బాలరాజు కుడి కనుబొమ్మకు స్వల్పంగా గాయమైంది. ఆఫీసర్లు ఎన్నికలను వాయిదా వేశారు.

పెద్దూర్​లో పరస్పర దాడులు

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్​ సింగిల్​ విండోలో చైర్మన్​ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. బీజేపీ నేతలపై టీఆర్ఎస్​ లీడర్లు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇక్కడ13 టీసీలకు గాను ఆరు బీజేపీ, ఆరు టీఆర్ఎస్​ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఏ పార్టీతో సంబంధం లేని మరో​  డైరెక్టర్​ బీజేపీకి మద్దతిచ్చారు. ఆదివారం ఉదయం చైర్మన్, వైస్​ చైర్మన్​ ఎన్నిక కోసం అధికారి రాధిక అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తమ డైరెక్టర్​ను బయటకు పంపాలంటూ టీఆర్ఎస్​ లీడర్లు సింగిల్​ విండో భవనంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  ఈ క్రమంలో బీజేపీ మద్దతుదారుడు  జూపల్లి  శ్రీనివాస్ రావు​పై  టీఆర్ఎస్​ నేతలు దాడి చేశారు. సుమారు 50 మంది పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.  లోపల ఉన్న టీఆర్ఎస్, బీజేపీ డైరెక్టర్లు ఘర్షణ పడ్డారు. ఎన్నికల అధికారి నుంచి టీఆర్ఎస్​ డైరెక్టర్లు పేపర్లు లాక్కున్నారు. ఆ సమయంలో ఎన్నికల అధికారి స్పృహ కోల్పోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారమే ఎన్నికల అధికారిని పంపించి ఎన్నికలు వాయిదా వేయించారని బీజేపి శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల అధికారిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకొని ఏడుగురు డైరక్టర్లు చేతులెత్తి నినాదాలు చేశారు.  కాగా, సిరిసిల్ల పోలీసుల తీరుపై కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీకి కోరం ఉన్నప్పటికీ ఎన్నికలు వాయిదా వేయడంపై అసహనం వ్యక్తం చేశారు.  ఎస్పీ రాహుల్​ హెగ్డేతో ఫోన్లో మాట్లాడి తమ డైరెక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు.

ఎన్నికలు జరిగిన పీఏసీఎస్​లు: 904

టీఆర్ఎస్​ మద్దతుదారులు: 759

కాంగ్రెస్​ మద్దతుదారులు:48