ఎక్కడ చూసినా టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే

ఎక్కడ చూసినా టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే
  • ఈవీడీఎం మరోసారి సైలెంట్, నామమాత్రంగా ఫైన్లు
  • కిందటిసారి లెక్కనే లీవ్‌‌పై వెళ్లిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్​
  • అధికారుల తీరుపై సోషల్​మీడియాలో జనం ఫైర్​

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయమైంది. సిటీలో ఎక్కడ చూసినా ఆ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి. ప్లీనరీ కోసం కొన్నిచోట్ల ట్రాఫిక్​ సిగ్నల్స్​కు అడ్డగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఎన్​ఫోర్స్ మెంట్ ట్విట్టర్ ఖాతాకు వస్తున్న ఫిర్యాదులకు మాత్రమే అధికారులు ఫైన్లు వేస్తున్నారు. దీంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

వచ్చిన ఫిర్యాదులకు మాత్రమే నామమాత్రంగా ఫైన్లు వేశారు. దాదాపు రూ.3లక్షల ఫైన్లు వేసినట్లు తెలిసింది. కిందటేడు అక్టోబర్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగిన సమయంలో సిటీ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫ్లెక్సీలు భారీగా పెట్టారు. అదే సమయంలో టెక్నికల్ సమస్య అంటూ ట్విట్టర్. ఆన్​లైన్​లో వచ్చిన ఫిర్యాదులను ఈవీడీఎం అధికారులు పక్కన పెట్టారు. దీనిపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మూడు రోజుల తర్వాత సమస్య పరిష్కారం అయిందంటూ ఆన్ లైన్ లో వచ్చిన కొన్ని ఫిర్యాదులకు ఫైన్లు వేశారు.

ఇప్పుడు మళ్లీ అదే తీరు కనిపిస్తున్నది. గత ప్లీనరి టైమ్ లో సెలవుల్లో వెళ్లిన జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, ఇప్పుడు మళ్లీ  సెలవులపై వెళ్లారు. ఇటీవల ఫ్లెక్సీ ప్రింటింగ్ సెంటర్ల మీద రైడ్స్ చేసిన ఈవీడీఎం వింగ్ ఇప్పుడు సైలెంట్ అయింది. బీజేపీ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ లనే టార్గెట్ చేసి తనిఖీలు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించి వేలాది ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి ప్రింట్ అయ్యాయనే దానిపై జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు.
 

జీవో.. టీఆర్ఎస్‌‌కు వర్తించదా?: రాజాసింగ్
హైదరాబాద్​లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్ల విషయంలో టీఆర్​ఎస్ పార్టీకి ఒక న్యాయం బీజేపీకి ఇంకో న్యాయమా? అని ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సిటీలో బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, జీవో కూడా జారీ చేశారన్నారు. ఇది బీజేపీకే వర్తిస్తుందా? టీఆర్​ఎస్​కు వర్తించదా? అని ప్రశ్నించారు.
టీఆర్​ఎస్​ ఫ్లెక్సీలపై కేఏ పాల్ ఫిర్యాదు
చట్టం అందరికి సమానమని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు జీహెచ్​ఎంసీ తీరుపై ఏం సమాధానం చెప్తారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రశ్నించారు. హైదరాబాద్​లో టీఆర్​ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై మంగళవారం జీహెచ్ఎంసీ ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేశారు. తర్వాత పాల్ మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ పై కేసు పెట్టి జైలులో పడేయాలని డీజీపీని కోరారు. గతంలో మేయర్ ఫ్లెక్సీకే రూ.3 లక్షల ఫైన్ వేసిన అధికారులు, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నాయన్నారు. కేసీఆర్ వద్ద పీకే రూ.200 కోట్లు తీసుకోలేదని భగవద్గీతపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
సర్కార్​ ఆఫీసుకు పార్టీ ఫ్లెక్సీ
ఇది ఢిల్లీలోని తెలంగాణ భవన్​. సర్కార్​ ఆఫీసు అయిన 9 అంతస్తుల ఈ బిల్డింగ్​మీదికెల్లి టీఆర్​ఎస్​ ఫ్లెక్సీని దించేశారు. టీఆర్​ఎస్​ ప్లీనరీ సందర్భంగా అక్కడి ఓ టీఆర్​ఎస్​ కార్యకర్త ఇలా ఏర్పాటు చేసిండు. వాస్తవానికి ఇటీవల కేసీఆర్​ రైతు నిరసన దీక్ష సందర్భంగా తొలిసారి ఇలాంటి ఫ్లెక్సీని పెట్టారు. ప్రభుత్వం చేస్తుందని అప్పుడు చూసీచూడనట్టు వదిలేశారు. అయితే, ఇప్పుడు పార్టీ కార్యక్రమానికీ ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోకపో వడమేంటన్న విమర్శలు వస్తున్నాయి. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వ సిబ్బంది దగ్గరుండి వేడుకు చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి

టీఆర్​ఎస్​తో ప్రశాంత్ కిశోర్ దోస్తీ

వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఇయ్యాల టీఆర్​ఎస్​ ప్లీనరీ.. జాతీయ రాజకీయాలే ఎజెండా!