లింగోజిగూడ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీఆర్ఎస్ నిర్ణయం

V6 Velugu Posted on Apr 16, 2021

  • బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరం: టీఆర్ఎస్

హైదరాబాద్: లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. గత డిసెంబర్ లో ఆయన చనిపోవడంతో ఖాళీ అయిన ఈ డివిజన్ కు ఈనెల 30వ తేదీన ఉప ఎన్నిక జరపుతున్నట్లు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుండి నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శుక్రవారం  ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు తెరాస పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  బీజేపీ ప్రతినిధి బృందం, స్వర్గీయ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Tagged Hyderabad, ghmc, by-election, greater,

Latest Videos

Subscribe Now

More News