అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలోదారి

అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలోదారి

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్​లో చేరిన లీడర్లు తమ సొంత గూటికి వెళ్లడానికి కొందరు.. ఇతర పార్టీల వైపు వెళ్లడానికి ఇంకొందరు మొగ్గు చూపుతున్నారు. నాలుగైదు ఏండ్ల  కిందట కాంగ్రెస్ లో ఉండి.. గత్యంతరం లేక అధికార పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇపుడు ఏదో ఒక దారి చూసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్లు వెళ్లడానికి బాటలు సుగమం చేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్నా.. ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో వీరంతా ఇన్నాళ్లు నారాజ్ గా ఉన్నారు. ఇక ఓపిక పట్టేది లేదంటూ తమ సత్తా ఏంటో చూపెట్టాలని భావిస్తున్నారు.

బొమ్మ శ్రీరామ్ బీజేపీలోకి..?

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‍గా హుజూరాబాద్‍ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియామకం తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేతలను టచ్‍లోకి తీసుకుంటున్నారు. హుస్నాబాద్‍ నియోజకవర్గంలో కాంగ్రెస్‍ పార్టీ నుంచి టీఆర్‍ఎస్‍ లోకి గత సాధారణ ఎన్నికల సమయంలో  చేరిన అల్గిరెడ్డి ప్రవీణ్‍రెడ్డి ఇటీవలే తన సొంతగూటికి చేరుకున్నాడు. అల్గిరెడ్డి ప్రవీణ్‍రెడ్డి కాంగ్రెస్‍ పార్టీ వీడిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి చురుగ్గా పాల్గొన్నాడు. నియోజకవర్గ ఇన్​చార్జిగా పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను చేశారు. కాంగ్రెస్‍ పార్టీ నుంచి నియోజకవర్గంలో తనకే టిక్కెట్‍ దక్కుతుందన్న తరుణంలో సడెన్‍గా పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రవీణ్‍రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై శ్రీరాంతోపాటు ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు. కరీంనగర్‍లో ఆయనకు వ్యతిరేకంగా సమావేశం సైతం నిర్వహించారు. అయినా అధిష్ఠానం ఎటువంటి సమాచారం లేకుండా ప్రవీణ్‍రెడ్డిని తీసుకురావడంపై శ్రీరాం నారాజ్​గా ఉన్నాడు. ఇటీవలే మరో మీటింగ్‍ పెట్టి తను పార్టీ వీడుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. పొమ్మనలేకనే పొగపెడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుపడ్డాడు. తన సోదరి బొమ్మ జయశ్రీ ఇప్పటికే బీజేపీ ఉన్నారు. ఆ సంబంధాలతోనే బీజేపీలోకి నేడే రేపో శ్రీరాం చేరడానికి రంగం సిద్ధం చేసుకుటున్నారని తెలిసింది. ఆయనతో పాటు కౌన్సిలర్లు, లోకల్ లీడర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ నెల రెండున చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రోజే చేరుతారనే ప్రచారం జరుగుతోంది.  

ఆరెపల్లి దారెటు...?  

జిల్లాలో జడ్పీ చైర్మన్‍గా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్‍ పార్టీ హయాంలో చీఫ్‍ విప్‍గా ఆయా హోదాల్లో పని చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‍ జనరల్‍ ఎలక్షన్‍ పూర్తయిన వెంటనే ఓడిపోయిన తను టీఆర్‍ఎస్‍ పార్టీలో చేరారు. కానీ ఆయనకు ఆ పార్టీలో ఎటువంటి గౌరవం లభించలేదు. నామినేటెడ్‍ పదవి వస్తుందని ఎంతో ఆశపడ్డా..  చివరికి నిరాశే ఎదురయ్యింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‍ సైతం ఎడముఖం పెడముఖంగా ఉండటంతో ముక్కుసూటి మనస్తత్వం కలిగిన ఆరెపల్లి  టీఆర్‍ఎస్‍ పార్టీలో ఇమడలేకపోతున్నాడు. వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఈ మధ్యే జరిగిన ప్లెక్సీల వివాదమే చెబుతోంది. ఈ పార్టీలో ఉంటే టిక్కెట్‍ వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉండటంతో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సన్నిహితులు ముఖ్యమైన నేతలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‍ పార్టీలోకి వెళ్లలేక అందరూ సూచించే బీజేపీ వైపు వెళ్లాలా అనే సమాలోచనలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.  

ఇమడలేకపోతున్నరు..

జిల్లాలో పేరున్న నాయకుడుగా ఉన్న కాంగ్రెస్​పార్టీ ఎమ్మెల్సీ టి.సంతోష్‍కుమార్‍ ఆ పార్టీ పదవి పూర్తయ్యాక టీఆర్‍ఎస్‍ లో చేరారు. పార్టీలో సాధారణ ఎన్నికల తర్వాత తనకు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఆశించారు. ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతోపాటు ఆ పార్టీలో కూడా ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. దీంతో చాలా రోజుల నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‍గా అయినా  పోటీ చేసి తన సత్తాచాటాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు. సొంతంగా రంగంలోకి దిగాలా లేక ఏదైనా పార్టీ అండతో ముందుకు వెళ్లాలా అనే ఆలోచనలు చేస్తున్నారు. ఆయనకు కొంచెం అటూఇటుగా టీఆర్‍ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్‍  పరిస్థితి కూడా అదేవిధంగా మారింది. మాజీ ఎమ్మెల్యేగా చేరిన సత్యనారాయణ గౌడ్‍ ఏదైనా పదవి వస్తుందని ఎంతో ఆశగా ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ రోజురోజుకు అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఆయన సైతం పార్టీని వీడేందుకు సమయం కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది. వీరితోపాటు టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వీరంతా నారాజ్ గానే ఉన్నారు. సమయం చూసి ఇతర పార్టీలోకి జంప్​ కావాలని భావిస్తున్నారు.