ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది

ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది

తెలంగాణ ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే అని, ప్రాజెక్టుల పేరుతో లూటీ జరుగుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కనీస నాణ్యత లేకుండా నిర్మాణం చేశారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రాజెక్టు పనులను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఉపేందర్ రెడ్డికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టు పనుల నాణ్యత లోపాలపై అన్ని కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. రూ. 2600 కోట్ల దుమ్ముగూడెం ప్రాజెక్టు టెండర్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు దోపిడీ జరుగుతోందని, చీఫ్ సెక్రటరీ కి లేఖ రాశామని, స్పందించక పోతే ఆయన పాత్ర కూడా అందని భావించాల్సి ఉంటుందని ఉత్తమ్ అన్నారు.

మెడిగడ్డ బ్యారేజి పనులను ఎల్ అండ్ టీకి రూ. 2591కోట్లకు ఇచ్చారని, ఆ తర్వాత ప్రాజెక్టు అంచనాలను రూ. 4583 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ప్రతిమ కంపెనీకి రూ. 10 వేల కోట్ల పనులు ఇచ్చారని, 2014 వరకు ప్రతిమ కంపెనీ ఒక్క ప్రాజెక్టు పని కూడా చేయలేదన్నారు.

పార్టీ మారినందుకు కందాళ ‌కు ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టులు అప్పగించారనేందుకు కొండపోచమ్మ సాగర్ నిదర్శనమ‌న్నారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీఆరెస్ నేతలందరూ రాష్ట్ర వనరులు దోచుకుంటున్నారని, వారిపై క్విట్ ప్రోకో కింద కేసు పెట్టాలన్నారు. నేతలను ప్రలోభాలకు గురిచేసారని ఆరోపణలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ విచారణ జరగాల‌న్నారు.

డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ లో గెలిచి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లారని నిరూపణ అయిందన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఇరిగేషన్-వాటర్ వర్క్ లో నాణ్యత లేని పనులు జరిగాయ‌న్నారు. ఇరిగేషన్ పై కాంగ్రెస్ పార్టీ లీగల్ గా పోరాటం చేస్తుందని చెప్పారు.