
హైదరాబాద్, వెలుగు: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొంటుండటంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం సెంచరీ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్ని కల్లో టీఆర్‌ఎస్ 88 స్థానా లు, కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, టీఆర్ ఎస్, కాంగ్రెస్ రెబెల్స్ రెండు చోట్ల గెలిచారు. రెబెల్స్ ఎన్నికయ్యాక టీఆర్ఎస్ లో చేరడంతో బలం 90కి పెరిగింది. తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నాలుగైదు రోజుల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. తర్వాత చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియ నాయక్ (ఇల్లెందు), ఉపేందర్ రెడ్డి (పాలేరు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సుధీర్ రెడ్డి (ఎల్‌బీనగర్), వనమా వెంకటేశ్వర్‌రా వు (కొత్తగూడెం) గులాబీ కండువా కప్పుకోనున్నట్టు చెప్పారు . దీంతో కాంగ్రెస్ బలం 11కు తగ్గింది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఈ చేరికలతో టీఆర్ ఎస్ పార్టీ బలం 99కి పెరిగింది. కాంగ్రెస్ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.