ఉద్యోగులపై చిన్నచూపు : ఓట్లు వేయలేదని కోపమా?

ఉద్యోగులపై చిన్నచూపు : ఓట్లు వేయలేదని కోపమా?

ప్రమోషన్లు రావు.. ట్రాన్స్​ఫర్లు కావు..  ఫిట్​మెంట్​పై సాగదీత
టీచర్లు అంటే చులకన భావం.. వారిని లోకల్​ బాడీలకు అప్పగించే యోచన
ఉద్యోగ సంఘాల లీడర్లకు ఓడీలు కట్
తమకు ఓటు వేయలేదన్న కోపంలో టీఆర్​ఎస్​ పెద్దలు

హైదరాబాద్, వెలుగు:ఫిట్​మెంట్​ లేదు.. ప్రమోషన్లు లేవు.. ట్రాన్స్​ఫర్లు లేవు.. రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగుల సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదు. వాళ్ల డిమాండ్లను పరిష్కరించడం లేదు. టీఆర్​ఎస్​ సెకండ్​ టర్మ్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులను చిన్నచూపు చూస్తోంది. టీచర్లనయితే  గవర్నమెంట్​ ఎంప్లాయీస్​గా గుర్తించేందుకు కూడా ఇష్టపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ  ఉద్యోగులను అవినీతి పరులుగా ప్రభుత్వ పెద్దలు ముద్ర వేశారు. తమకు పాత పెన్షన్​ స్కీమ్​ను అమలు చేయాలని సీపీఎస్​ పరిధిలోని ఎంప్లాయీస్​ ఏండ్లకేండ్లుగా అడుగుతున్నా సర్కారు వింట లేదు. ఉద్యోగ లీడర్లకు ఓడీలను  కట్​ చేసింది.

సీపీఎస్​ ఎంప్లాయీస్​కు అన్యాయం

సీపీఎస్​(కాంట్రిబ్యూటరీ​ పెన్షన్​ స్కీమ్​) పరిధిలోని 5 వేల మంది ఉద్యోగుల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేంద్ర విధానంతో తమకు సంబంధం లేదని, రిక్రూట్​మెంట్ జరిగేనాటికి ఉన్న పెన్షన్ స్కీమ్​నే  అమలు చేస్తామని వాదిస్తోంది. కేంద్రంలో -2004 జనవరి 1 నుంచి  సీపీఎస్  అమల్లోకి వచ్చింది. ఇది  మన దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో  2004  సెప్టెంబర్​ 1 నుంచి  అమలోకి వచ్చింది. అయితే కొత్త పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చే సమయం నాటికి సెలక్షన్ ప్రాసెస్​లో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్​నే  అమలు చేయాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రం 2004 జనవరి 1 నాటికి సెలక్షన్  ప్రాసెస్​లో ఉన్న ఎంప్లాయీస్​కు -2020 ఫిబ్రవరి 17 నుంచి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తోంది. రాష్ట్రంలో కూడా కేంద్రం మాదిరిగా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం వినిపించుకోవడం లేదు.

ఈ విషయంలో ఫైన్సాన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చినా సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పాత పెన్షన్​ స్కీం ప్రయోజనాలు అందుకోవాల్సిన సీపీఎస్​ ఎంప్లాయీస్​ 5 వేల మంది వరకు ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో టీచర్లు, లెక్చరర్లు, గ్రూప్  వన్, గ్రూప్​ టు ఉద్యోగులు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు ఉన్నారు.

టీచర్లు అంటే సార్ కు గిట్టదట

సీఎంకు గవర్నమెంట్​ టీచర్లు అంటే గిట్టదని, ప్రతి దానికీ వారు ఆందోళన చేస్తారన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఇటీవల పీఆర్సీ కమిషన్.. ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని రికమెండ్​ చేయడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపట్టారు. దీంతో అసలు టీచర్లను ప్రభుత్వ ఉద్యోగుల జాబితానుంచి తీసి లోకల్  బాడీలకు అప్పగించాలని, వారికి పీఆర్సీ వర్తించకుండా చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు లీకులు బయటకు వచ్చాయి. డిసెంబర్​లో సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్ లో ఉద్యోగ సంఘాల లీడర్లను పిలిచి లంచ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా టీచర్ సంఘాల లీడర్లను పిలవలేదు. టీచర్లపై కోపంతోనే వాళ్లను లంచ్ మీటింగ్​కు పిలువలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఓడీలు కట్

ఫస్ట్ టర్మ్​ పాలనలో ఎంప్లాయీస్ లీడర్లకు పెద్ద ఎత్తున ఓడీలు(ఆన్ డ్యూటీ) ఇచ్చిన టీఆర్​ఎస్ సర్కార్​.. సెకండ్  టర్మ్​లో వాటిని కట్ చేసింది. అసలు ఓడీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని భావించింది. కానీ ఇది కార్మిక చట్టాలకు విరుద్దమని లీగల్​ ఎక్స్​పర్ట్స్​ చెప్పడంతో కేవలం నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, ఫోర్త్  క్లాస్ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలకు మాత్రం ఓడీ సౌకర్యం కొనసాగిస్తోంది. గతంలో టీచర్ యూనియన్  లీడర్లకు  ఓడీలు ఉండేవి. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో వాటిని పూర్తిగా రద్దు చేశారు.

పెండింగ్లో ప్రమోషన్లు..

టీఆర్​ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు  ట్రాన్స్​ఫర్లు లేవు. నిబంధనల ప్రకారం ప్రతి రెండేండ్లకు ఓసారి బదిలీలు జరగాలి. కానీ బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వంలో కదలిక లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిన బదిలీ చేసిన వేలాది మంది ఉద్యోగులను అక్కడే బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఇంతవరకు వారికి శాశ్వత పద్ధతిన పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మధ్య చేపట్టిన ప్రమోషన్ల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. కేవలం హెచ్ వోడీల వరకే ప్రమోషన్లు ఇచ్చారు. అందులో కూడా సీఎం కేసీఆర్  ఆధీనంలోని రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, సెక్రటేరియట్ లో ప్రమోషన్లు పెండింగ్​లో పెట్టారు.

ఓట్లు వేయలేదని కోపమా?

2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు గవర్నమెంట్ ఉద్యోగులు ఓటు వేయలేదనే అనుమానం ప్రభుత్వ పెద్దల్లో
ఉంది. ఆ ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టీఆర్ఎస్ కు పడలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మెజార్టీ ఎంప్లాయీస్ అధికార పార్టీపై కోపంగా ఉన్నారు. ఈ మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మెజార్టీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టీఆర్ ఎస్ కు పడలేదు. ఉద్యోగుల ఓట్లు మనకు పడనప్పుడు వాళ్లను ఎందుకు పట్టించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు
టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి.

ఎంప్లాయీ ప్రెండ్లీ మూన్నాళ్ల ముచ్చట్నే!

టీఆర్​ఎస్​ ఫస్ట్ టర్మ్  పాలనలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ఫ్రెండ్లీ కల్చర్ ఉండేది. అడపాదడపా ఉద్యోగ సంఘాల లీడర్లకు ప్రగతిభవన్ నుంచి ఇన్విటేషన్లు వచ్చేవి. టెన్త్ పీఆర్సీ 29 శాతం ఫిట్​మెంట్​ రికమెండ్ చేస్తే కేసీఆర్ ఏకంగా 43 శాతం ఫిట్​మెంట్ ప్రకటించారు. అయితే రెండో  టర్మ్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంప్లాయీస్​ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ ఉద్యోగులు అవినీతిపరులు అంటూ సీఎం కేసీఆర్​ అనేకసార్లు బహిరంగంగానే  ఆరోపించారు. 2018 జులై 1 నుంచి ఉద్యోగులందరికీ అమలు చేయాల్సిన పీఆర్సీని అటకెక్కించారు. గడువు కంటే ముందే బిశ్వాల్ ఆధ్వర్యంలో పీఆర్సీ కమిషన్​ను  నియమించినా.. రిపోర్టు ఇవ్వడానికి  కమిషన్​ 32 నెలల టైం తీసుకుంది. కమిషన్ సిఫార్సు చేసిన 7.5 శాతం ఫిట్​మెంట్ ను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఉద్యోగులు ఆందోళనలకు దిగడం  సీఎం కేసీఆర్​కు  మరింత కోపాన్ని తెచ్చిపెట్టిందని  ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.