ఆ జిల్లాలపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

ఆ జిల్లాలపై టీఆర్ఎస్  ప్రత్యేక దృష్టి
  • గత ఎన్నికల్లో టీఆర్ఎస్​కు నిరాశ
  • ఖమ్మానికి రెండు రాజ్యసభ సీట్లు
  • తాజాగా ఐ ప్యాక్ టీమ్ సర్వే
  • స్కీంల అమలు,  నేతల పనితీరుపై ఫీడ్ బ్యాక్

ఖమ్మం, వెలుగు: గత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాని దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈసారి టీఆర్​ఎస్ హైకమాండ్ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్​ చేస్తోంది. బీజేపీ గెలుచుకున్న కరీంనగర్,  నిజామాబాద్​, ఆదిలాబాద్​పార్లమెంట్​నియోజకవర్గాలమీదా నజర్ పెడ్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నందున ఆలోగా కేడర్​బలపడేలా వ్యూహాలు రూపొందించుకుంటోంది. ఖమ్మం జిల్లాలో  అంతర్గత పోరు వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ ఘోరంగా దెబ్బతిన్నది. దీంతో ఈ జిల్లా మీద పార్టీ హైకమాండ్​  దృష్టి పెట్టింది. ఇటీవల జిల్లాకు చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉందని పార్టీ లీడర్లు నమ్ముతున్నారు. 
రెండో విడత సర్వే 
గతంలో తక్కువ సీట్లు వచ్చిన జిల్లాలమీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తూనే.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రమంతటా పట్టు పెంచుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజలు పార్టీ గురించి..  ప్రభుత్వ పనితీరు గురించి.. ఎమ్మెల్యేల వ్యవహారశైలి గురించి ఏమనుకుంటున్నారన్నది ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్​ ప్రశాంత్​ కిషోర్​కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ద్వారా మూడు, నాలుగు నెలల కిందటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేయించారు. తాజాగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరోసారి ఐప్యాక్ టీమ్ సర్వే చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఊరూరు తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న ఐ ప్యాక్ టీమ్స్ ప్రస్తుతం వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు చెప్తున్నారు. సంక్షేమపథకాలు అమలు చేస్తున్నా  పార్టీకి, ప్రజలకు మధ్య గ్యాప్  ఎందుకు ఉందన్న అంశాన్ని సర్వే బృందాలు స్టడీ చేస్తున్నాయని తెలుస్తోంది.  మొదటిసారి ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన సర్వేలో ఎక్కువగా సామాన్యులనుంచే ఫీడ్ బ్యాక్​ తీసుకున్నారు. గత వారం రోజులనుంచి జరుగుతున్న రెండో విడత సర్వేలో మరింత వివరంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ప్రశ్న, జవాబు లాంటి రొటీన్ ఫార్మెట్​కాకుండా పబ్లిక్​తో అన్ని  విషయాలను వివరంగా డిస్కస్​ చేస్తున్నారు. లోకల్​ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది, పార్టీ పరిస్థితి ఏంటి, స్కీమ్​లు సరిగా అమలవుతున్నాయాలేదా, నియోజకవర్గ లీడర్ల మధ్య గ్రూపులున్నాయా, కాంగ్రెస్​, బీజేపీలకున్న బలమెంత, ఆ పార్టీల లీడర్లకు పబ్లిక్​లో ఉన్న పట్టు, నియోజకవర్గాల్లో చాలాకాలంగా  పెండింగ్ లో ఉన్న సమస్యలేమిటి, మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులేమన్నా ఉన్నాయా, టీఆర్ఎస్​లో పని చేస్తున్నా తగిన గుర్తింపు రానివారున్నారా అంటూ ఎంక్వైరీ చేస్తున్నారు.   సర్వేలో భాగంగా మీడియా ప్రతినిధులతోనూ ఈ  టీమ్స్​  సమావేశమవుతున్నాయని సమాచారం. వారితో ఫీడ్​బ్యాక్​తీసుకుంటున్నారు. వరంగల్​ తర్వాత ఈ టీమ్స్​ కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఐప్యాక్​ టీమ్స్​ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు మీద లోతుగా స్టడీ చేస్తుండడం ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. 
కొత్త లీడర్​షిప్​
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఒకే చోట గెలిచింది. జిల్లాలో పార్టీ ముఖ్యనాయకుల మధ్య వర్గపోరు వల్ల పార్టీ ఇక్కడ ఘోరంగా దెబ్బతిన్నది. ఆతర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలేవీ సక్సెస్​ కాలేదు. సీనియర్ల మధ్య సఖ్యత కుదరలేదు. కాంగ్రెస్, టీడీపీలనుంచి గెలిచి టీఆర్ఎస్​ లో చేరిన ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గాల్లోని సీనియర్​ లీడర్లకు మధ్య గొడవలతో జిల్లాలో పార్టీ పరిస్థితి కుదుటపడడంలేదు. దీంతో హైకమాండ్​ మాజీలను సైడ్ చేసి, కొత్త లీడర్లను ప్రోత్సహిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తాతా మధు లాంటి లీడర్​కు ఎమ్మెల్సీతో పాటు పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ పోస్ట్​ ఇవ్వడం,  మూడు రాజ్యసభ సీట్లు ఉంటే రెండింటినీ ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలకు కట్టబెట్టడం వచ్చే ఎన్నికల వ్యూహంలో భాగమేనని అంటున్నారు.