కులానికో ఇన్‌‌చార్జ్ ..హుజూర్‌‌నగర్ లో TRS ప్లాన్

కులానికో ఇన్‌‌చార్జ్ ..హుజూర్‌‌నగర్ లో TRS ప్లాన్
  • హుజూర్‌‌నగర్ ఉప ఎన్నికకు టీఆర్‌‌ఎస్ ప్లాన్

హుజూర్​నగర్​ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్​ఎస్​.. ఇప్పటికే నియమించిన 30 మందితోపాటు కొత్తగా  మరో 30  మందిని ఎలక్షన్​ ఇన్​చార్జ్​లుగా నియమించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు.  నియోజకవర్గం ఉన్న 7 మండలాలు రెండు మున్సిపాల్టీలకు ఇన్​చార్జులుగా జనరల్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు వీరు అక్కడే మకాం వేసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నారు. 9 మంది జనరల్ సెక్రటరీలకు స్థానిక పరిస్థితులు వివరించేందుకు నలుగురు లోకల్ లీడర్లు సపోర్టుగా ఉంటారు. నియోజక వర్గంలో కులాల వారీగా, మతాల వారీగా, మండలాల వారీగా ఇన్​చార్జ్​లను నియమించారు. మెజార్టీ కులాలన్నింటికీ ఇన్​చార్జ్​లను వేశారు. రెడ్డి, కమ్మ, రజక, బెస్త, ఎస్సీ, ఎస్టీ, వైశ్య, బ్రహ్మణ కులాలకు పార్టీలోని ఆయా కులాలకు చెందిన నాయకులు ఎందరు ఉంటే అందరిని ఇన్​చార్జ్​లుగా వేశారు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు కూడా ఇన్​చార్జ్​లుగా బాధ్యతలు అప్పగించారు. ముగ్గురు మహిళా నేతలకు కూడా ఎన్నికల బాధ్యతలు ఇచ్చారు. మహబూబాబాద్ ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణిని ఇన్​చార్జ్​లుగా నియమించారు. కాంగ్రెస్​ను ఢీ కొట్టేందుకు ఎన్నికలయ్యేదాకా అక్కడే ఉండాలని టీఆర్​ఎస్​ హైకమాండ్​ ఆదేశించడంతో ఆ పార్టీ  నాయకులు హుజూర్ నగర్  బాటపట్టారు. చాలా మంది నేతలు శుక్రవారం నియోజకవర్గానికి చేరుకోనున్నారు.

త్వరలో కేటీఆర్​.. ఆ తర్వాత కేసీఆర్​ పర్యటన

హుజూర్​నగర్​ నియోజక వర్గంలో టీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు మూడు రోజుల్లో పర్యటించనున్నారు. స్థానిక నేతలతో నేరుగా ఆయన సమీక్షలు జరుపనున్నారు. పార్టీ పరిస్థితులు అంచనా వేశాక సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సర్పంచ్ లను బుజ్జగిస్తున్న ఎర్రబెల్లి

హుజూర్ నగర్  ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్ లు పోటీ చేసేందుకు సిద్ధమవడం టీఆర్​ఎస్​కు తలనొప్పిగా మారిందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. సర్పంచ్​లంతా అక్కడ రెండు మూడు రోజుల్లో నామినేషన్లు వేయనున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో  సర్పంచ్​లు పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. సర్పంచ్ లను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లికి బాధ్యతలు అప్పగించారు. ఆయన సర్పంచ్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వారు మాత్రం పోటీ నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేస్తున్నట్లు  తెలిసింది.

జగదీశ్​ బదులు పల్లా

హుజూర్​నగర్​ ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుంచి అక్కడి ఉప ఎన్నికపై మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టి సారించారు. టీఆర్​ఎస్​లోకి అక్కడి కాంగ్రెస్​ నాయకుల చేరికలను దగ్గరుండి పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక జగదీశ్ రెడ్డి బదులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్​చార్జీగా టీఆర్​ఎస్​ హైకమాండ్​ నియమించింది. మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో నల్గొండ స్థానంలో పార్టీ ఓడిపోవడం వంటపరిణామాల నేపథ్యంలో జగదీశ్​ను ఈ ఉప ఎన్నిక బాధ్యత నుంచి దూరంబెట్టి పల్లాకు అప్పగించినట్లు చర్చ నడుస్తోంది.