మండల మీటింగ్​ను బైకాట్ చేసిన టీఆర్​ఎస్​ సర్పంచులు

మండల మీటింగ్​ను బైకాట్ చేసిన టీఆర్​ఎస్​ సర్పంచులు

ఆసిఫాబాద్, వెలుగు : తమ పదవీకాలం ముగిసిపోనున్నా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేకపోయామని, తమను గెలిపించిన ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని  టీఆర్​ఎస్​కు చెందిన సర్పంచులు గురువారం జరిగిన ఆసిఫాబాద్​ మండల పరిషత్​ జనరల్​బాడీ మీటింగ్​ను బైకాట్ చేసి ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కుడా డెవలప్ చేసే పరిస్థితి లేదని వాపోయారు. గ్రామపంచాయతీల్లో ఉన్న సమస్యలను గతంలో చాలాసార్లు మండల మీటింగుల్లో చెప్పినప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు ఇప్పటివరకు తమ సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చొరవ చూపకపోవడంతో విసిగిపోయి బహిష్కరించాల్సివచ్చిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలవల్ల దెబ్బతిన్న  రోడ్లను  రిపేరు చేయడంలేదని.. ఊళ్లలో అనేక సమస్యలున్నాయని వివరించారు.  టీఆర్ఎస్​సర్పంచులు శ్రీనివాస్, భీమేశ్​, వినోద్, మహేశ్, బాబురావు, వరలక్ష్మి, సీత, కౌసల్య ఆందోళనలో పాల్గొన్నారు.

నేలపై కూర్చొన్న సర్పంచ్ 

అధికారుల తీరును నిరసిస్తూ ఈదులవాడ సర్పంచ్ భీమేశ్​ మీటింగ్​ జరుగుతుండగా లోనే నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడ నుంచి సింగరావు పేట్ వరకు రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా అధికారులు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోడ్డు లేక స్కూల్ బస్సు, ఆటోలు నడవడంలేదన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు లేచేది లేదని బైఠాయించారు. అధికారులు స్పందించకపోవడంతో మిగతా సర్పంచులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.