పంచాయతీ ఎన్నికల్లోనూ TRS దే హవా

పంచాయతీ ఎన్నికల్లోనూ TRS దే హవా

 పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కారుకే పట్టం కట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత  మొదటి సారిగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార TRS  మద్దతుదారుల హవా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,731 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా 2,310 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా  చోట్ల ఈ నెల 21,25,30 తేదీల్లో పోలింగ్‌ జరిగింది. అన్ని విడతల్లో కలిపి 60 శాతానికి పైగా టీఆర్‌ఎస్‌ మద్దతు దారులే గెలుపొందారు. మరో 15 శాతం పంచాయతీల్లో స్వతంత్రులు, 25 శాతం సీట్లలో కాంగ్రెస్‌,TDP, ఇతర పక్షాలు గెలుపొందాయి. విజయం సాధించిన స్వతంత్రుల్లోనూ చాలా మంది TRSకు సంబంధించిన వారే. మూడో విడతలో ఏకగ్రీవాలతో కలిపి TRS మద్దతుదారులు 2,434  ప్రాంతాల్లో, కాంగ్రెస్‌ మద్దతుదారులు 911 చోట్ల, ఇండిపెండెంట్లు 490 పంచాయతీల్లో విజయం సాధించారు. మొత్తంగా 7,654 చోట్ల టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, 1,806 చోట్ల స్వతంత్రులు, మిగతా 3,041 పంచాయతీల్లోకాంగ్రెస్‌, BJP, TDP, వామపక్షాల మద్దతుదారులు గెలుపొందారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో జనం ఆ పార్టీకి ఘన విజయాలు ర్టీ సాధించి పెడుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌‌‌‌‌‌‌‌ భారీ మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన నెలన్నర రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీంతో TRS‌‌‌‌‌‌‌కు అనుకూలంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి పథకాలు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు పని చేశాయని పార్టీ నేతలు  అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో 4,383 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. 500 జనాభా దాటిన 1,700కుపైగా తండాలను, చిన్న గ్రామాలను కూడా పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అలాంటి చిన్న పంచాయతీలను ఏకగ్రీవం చేసి, ప్రోత్సాహక నిధులు అందుకునేలా చూడాలని సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరిగింది. ఇలాంటి వాటిల్లో అత్యధికం టీఆర్‌ఎస్ మద్దతుదారులే గెలుచుకున్నారు.