
ఫేస్ బుక్ ప్రేమలు.. ఇన్స్టాగ్రామ్ లవ్ ల కోసం బార్డర్లు దాటుతున్నారు అమర ప్రేమికులు. వందల.. వేల కిలో మీటర్లు ప్రయాణించి తమ లవర్ ను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య లవర్ కోసం ఇండియా పాక్ బార్డర్ దాటాడు ఓ ప్రేమికుడు. ఇప్పుడు అలాంటి స్టోరే మళ్లీ రిపీటైంది. కాకపోతే ఈసారి అమ్మాయి.. వచ్చింది బంగ్లాదేశ్ నుంచి. విసా లేకుండా.. జవాన్ల కళ్లుగప్పి ఇండియాకైతే వచ్చేసింది కానీ.. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటనేదే ఇక్కడ ట్విస్ట్.
బంగ్లాదేశ్ కు చెందిన గుల్షనా ఎక్తేర్ అనే యువతి.. బెంగళూర్ కు చెందిన దత్తా యాదవ్ తో ఆన్ లైన్ ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ ఇన్ స్టా ద్వారా లవ్ లో పడిపోయారు. రోజూ మెసేజ్ లు.. వీడియో కాల్స్ తో మరింత క్లోజయ్యారు. అలా ఎనిమిది నెలలుగా వారి ప్రేమాయణం కొనసాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఆశలు, ఊహలు, విరహ తాపాలతో.. ఇక లాభం లేదు డైరెక్ట్ గా కలవాల్సిందేనని డిసైడ్ అయ్యారు.
కామా తురానం న భయం.. న సిగ్గు.. అన్నట్లు ‘‘ప్రేమా తురానం న భయం.. న బార్డర్.. ’’ అంటూ ఇద్దరూ కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ లోని బొగురా జిల్లా పల్సా గ్రామం నుంచి లవర్ కోసం గురువారం (జులై 10) బార్డర్ దాటేసింది గుల్షనా. అదే విధంగా తన ప్రేయసి అంత సాహసం చేస్తుంటే తను చేయలేనా అన్నట్లు.. బెంగళూరు నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి బోర్డర్ లోని సెపహిజాలా జిల్లా హరిహొర్దులా గ్రామానికి చేరుకున్నాడు దత్తా. ఇద్దరైతే సరిహద్దుల్లో కలుసుకున్నారు కానీ.. ఆ కలయికే వారి జీవితాలను మార్చేసింది.
►ALSO READ | ట్రంప్ తారీఫ్ల మోత..మెక్సికో,యూరప్లపై 30శాతం సుంకం
ఎంతో కాలంగా ఆన్ లైన్ ప్రేమలో మునిగిన జంటకు.. కలవాలి కలవాలి అనే ఆతురతతో.. కలిసిన తర్వాత వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ వాళ్ల హ్యాపీనెస్ ఎక్కువ సేపు నిలవలేదు. అక్రమంగా బోర్డర్ దాటినట్లు గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వాళ్లను అదుపులోకి తీసుకుని మధుపూర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. గురువారం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. పాస్ పోర్టు చట్టం, భారతీయ న్యాయ సంహిత, 2023 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. గుల్షనాను త్రిపుర జైల్లో కి పంపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి కుట్ర కోణాలేమైనా ఉన్నాయేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు పోలీసులు.