నల్గొండలో టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు

నల్గొండలో టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు

రాష్ట్రంలో వడ్ల కొనుగోలుపై రాజకీయాలు హీటెక్కాయి. రెండోరోజు ఐకేపీ సెంటర్ల పరిశీలనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. సంజయ్ వెళ్లిన ప్రతి ఐకేపీ సెంటర్ దగ్గర పెద్దఎత్తున నల్లజెండాలతో ఆందోళనకు దిగారు టీఆర్ఎస్ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల హోరాహోరీ నినాదాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయి.. ఏకంగా పోలీసులపై దాడి చేశారు. 

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోసలు పడుతుంటే.. అదే వడ్ల ఇష్యూ మీద TRS, BJPలు కొట్టుకుంటున్నాయి. రెండోరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల టూర్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. ఉదయం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో ఐకేపీ సెంటర్ ను పరిశీలించేందుకు వెళ్లిన సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు TRS కార్యకర్తలు. తర్వాత చివ్వెంల ఐకేపీ సెంటర్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించేందుకు వెళ్లగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు, చెప్పులు, కర్రలు విసురుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చాలాసేపు సూర్యాపేట-ఖమ్మం రహదారిపై కారులోనే ఉండిపోయారు బండి సంజయ్. చివ్వెంల ఐకేపీ సెంటర్ దగ్గర బండి సంజయ్ టూర్ ను నిరసిస్తూ.. నల్లజెండాలతో నిరసన తెలిపారు TRS నాయకులు. BJP కార్యకర్తలు కూడా భారీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గోబ్యాక్ బండిసంజయ్ అంటూ TRS కార్యకర్తలు.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మరోవైపు ఆటోలో కర్రలను తీసుకొచ్చారు TRS నేతలు. ఆటో నుంచి కర్రలు తీసి కార్యకర్తలకు పంచుతుండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రానికి వెళ్లిన సంజయ్ కి నిరసనలు తెలిపారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. అయినా ఓ ఐకేపీ సెంటర్ దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు సంజయ్. ఆత్మకూరు ఎస్..మండలం నుంచి అర్వపల్లికి వెళ్లాల్సి ఉండగా.. సంజయ్ అర్వపల్లికి రాకముందే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సంజయ్ ను అడ్డుకునేందుకు భారీగా TRS కార్యకర్తలు అక్కడికి చేరుకొని.. నల్లజెండాలతో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనిపించిన బీజేపీ కార్యకర్తలను వెంటబడి మరీ కొట్టారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఓ బీజేపీ కార్యకర్తను.. పొట్టలో తంతూ అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడంతో చాలాసేపు టెన్షన్ పరిస్థితులు కొనసాగాయి.  అంతటితో ఆగకుండా పోలీసులపైకి దూసుకెళ్లారు TRS కార్యకర్తలు. కర్రలతో పోలీసులపై దౌర్జన్యం చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ  కర్రలతో దాడి చేశారు. పోలీసులను అక్కడ్నుంచి తరిమికొట్టే  ప్రయత్నం చేశారు  TRS కార్యకర్తలు. దీంతో అక్కడ  చాలాసేపు  ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో పోలీసులను కొట్టారు. TRS కార్యకర్తల దాడిలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. 

 అర్వపల్లి దగ్గర తుంగతుర్తి నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి కడియం రామచంద్రయ్య కారును ధ్వంసం చేశాయి టీఆర్ఎస్ శ్రేణులు. అర్వపల్లి దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దాదాపు 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి.  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో బండి సంజయ్ ను అర్వపల్లి రావొద్దని కోరారు పోలీసులు. అయితే అర్వపల్లి రైతులతో మాట్లాడాకే వెళ్తానని పట్టుబట్టారు సంజయ్. చివరకు పోలీసులు భద్రతా సమస్యలు తల్లెత్తుతాయని రెక్వెస్ట్ చేయడంతో నాగారం నుంచి తిరుమలగిరి మీదుగా జనగామకు చేరుకున్నారు బండి సంజయ్. మార్గమధ్యంలో తిరుమలగిరి దగ్గర బండి సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నల్లజెండాలతో నిరసన తెలిపారు TRS కార్యకర్తలు.  సూర్యాపేట BJYM కార్యకర్త రాపర్తి రాముపై రాళ్లతో దాడి చేశారు TRS కార్యకర్తలు. ఐకేపీ సెంటర్ల పరిశీలిస్తున్న బండి సంజయ్ పర్యటన కోసం వెళ్తున్న రాముపై.. సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన TRS కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో రాము తలకు గాయాలు అయ్యాయి. మరోవైపు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉన్నా... తన పర్యటనకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు SP రంగనాథ్. సంజయ్ పర్యటనలో జరిగిన ఘర్షణలో BJP, TRS నేతలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసులు పెట్టామన్నారు.