41 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కారుతో కమలం ఢీ

41 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కారుతో కమలం ఢీ

నాలుగు ఎంపీ సెగ్మెంట్లు.. వాటి పరిధిలోని 41 మున్సిపాలిటీలు.. రాష్ట్రంలో ఇప్పుడు బాగా హీటు పుట్టిస్తున్నవి ఇవే. త్వరలో మున్సిపల్​ ఎలక్షన్లు జరుగనుండటంతో ఇటు అధికార టీఆర్ఎస్, అటు బీజేపీ వీటిపైనే నజర్​పెట్టాయి. లోక్​సభ ఎలక్షన్లలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్​ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. వీటి పరిధిలో ఆరు మున్సిపల్​ కార్పొరేషన్లు, 35 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో తమ బలం నిలబెట్టుకోవాలని, వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలను సాధించాలని భావిస్తోంది. మరోవైపు లోక్​సభ రిజల్ట్​తో అనూహ్య ఫలితాలతో కంగుతున్న టీఆర్ఎస్ కూడా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ప్రత్యేకంగా ఫోకస్​ చేసింది. వీటితోపాటు మహబూబ్​నగర్​ ఎంపీ సీటు పరిధిలోని మున్సిపాలిటీలనూ గెలుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆయా చోట్ల ముమ్మరంగా మెంబర్​షిప్​ డ్రైవ్ చేపట్టి, బూత్‌‌‌‌ లెవల్‌‌‌‌ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌‌‌‌చార్జిని నియమించి, మరో నలుగురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని.. ఓటర్లను నేరుగా కలిసి టీఆర్ఎస్​కు ఓటేసేలా ఒప్పించాలని చూస్తోంది.

సగానికిపైగా చోట్ల..

నిజామాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ఎంపీ సీట్ల పరిధిలోని రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ల వారీగా బీజేపీకి, తమకు వచ్చిన ఓట్లను టీఆర్ఎస్​ విశ్లేషించుకున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఎక్కడ బలం పెంచుకోవాలో అంచనాకు వచ్చినట్టు సమాచారం. మరో 3, 4 మున్సిపాలిటీల్లోనూ బీజేపీ ప్రభావం ఉండొచ్చని భావిస్తోంది. నార్త్​ ఇండియన్లు ఎక్కువగా ఉండే మేడ్చల్‌‌‌‌ జిల్లాలోనూ బీజేపీ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌కు స్పందన ఎక్కువగా ఉన్నట్టు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మేడ్చల్‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్​ తప్ప మిగతా చోట్ల టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌కు స్పందన లేదని తెలుస్తోంది. అక్కడ టీఆర్ఎస్​కు ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

ప్రత్యేక కమిటీలతో..

కార్పొరేషన్లు, మునిపాలిటీల్లో డివిజన్లు/వార్డుల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్​ నిర్ణయించింది. ఆయా కమిటీల బాధ్యులు బూత్‌‌‌‌ లెవల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జులతో కో-ఆర్డినేట్‌‌‌‌ చేసుకుంటూ.. ఆయా ప్రాంతాల్లోని జనం ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశముంది, వారిని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటు వేయించేందుకు ఏం చేయాలన్న వివరాలు సేకరిస్తారు. ప్రతి ఓటరుకు సంబంధించిన పక్కా డేటాతో లెక్కగడతారు. టీఆర్ఎస్​ ఎక్కడెక్కడ వెనుకబడిందో గుర్తించి.. ఆక్కడ లోకల్​ అంశాలతో హామీలు, వాగ్దానాలను ప్రకటించే బాధ్యతను స్థానిక ఇన్‌‌‌‌చార్జులకు అప్పగించనున్నారు. మొత్తంగా ఓటర్​ కేంద్రంగానే క్యాంపెయిన్‌‌‌‌ చేయాలని టీఆర్ఎస్​ నిర్ణయించినట్టు సమాచారం.

ఎంపీ ఓట్ల లెక్కలతో చూస్తే..

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీల వారీగా ఓటర్ల తాజా లిస్టులను ఇంకా ప్రకటించలేదు. 2011 జనాభా లెక్కల వారీగా ఆయా నగరాలు, పట్టణాల జనాభాను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో.. లోక్​సభ ఎలక్షన్లలో పోలైన ఓట్లను బట్టి చూస్తే..

నిజామాబాద్​ పరిధిలో..

…నిజామాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌లో బీజేపీ కన్నా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 7 వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ ఈసారి సభ్యత్వ నమోదులో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ సుమారు 3 లక్షల మంది వరకు ఓటర్లున్నారు.

…బాల్కొండలో బీజేపీకి 68,064 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 56,502 ఓట్లు పోలయ్యాయి. ఈ సెగ్మెంట్​ పరిధిలోని భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీలో 9 వేల మందికిపైగా ఓటర్లుండగా.. బీజేపీ ఆధిపత్యం ఎక్కువ.

…బోధన్‌‌‌‌ మున్సిపాలిటీలో బీజేపీ ప్రభావం పెరిగినట్టు లెక్కలు వేస్తున్నారు.

…జగిత్యాల సెగ్మెంట్​లో బీజేపీకి 66,179 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 58,413 ఓట్లు వచ్చాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలోనూ బీజేపీకి భారీ ఆధిక్యం దక్కింది.

…కోరుట్లలో బీజేపీకి 77,023 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 57,604 ఓట్లు వచ్చాయి. ఈ సెగ్మెంట్​ పరిధిలోని కోరుట్ల, మెట్‌‌‌‌పల్లి మున్సిపాలిటీల్లోనూ బీజేపీకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

…మేడ్చల్‌‌‌‌-జిల్లాలోని మేడ్చల్‌‌‌‌, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్‌‌‌‌ మున్సిపాలిటీలు, బోడుప్పల్‌‌‌‌, ఫీర్జాదిగూడ, జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, నిజాంపేట కార్పొరేషన్లలో బీజేపీ నుంచి టైట్‌‌‌‌ ఫైట్‌‌‌‌ తప్పదని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

కరీంనగర్​ సీటు పరిధిలో..

…కరీంనగర్‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్​ పరిధిలో బీజేపీకి 1,10,689 ఓట్లు పోల్‌‌‌‌ కాగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కు 58,508 ఓట్లు మాత్రమే వచ్చాయి. కరీంనగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌తో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ ఈ నియోజకవర్గంలో ఉంది. అర్బన్‌‌‌‌ ఏరియా ఓట్లే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.

…చొప్పదండి సెగ్మెంట్లో బీజేపీకి 97,441 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 41,396 ఓట్లు వచ్చాయి. చొప్పదండి మున్సిపాలిటీలో పది వేలకుపైగా ఓటర్లుండగా.. బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచింది.

…. వేములవాడ సెగ్మెంట్​లో బీజేపీకి 73,290 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 47,399 ఓట్లు పోలయ్యాయి. వేములవాడలో 35 వేల వరకు ఓట్లుండగా బీజేపీకే బలం ఎక్కువ.

…సిరిసిల్లలో బీజేపీ కన్నా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 5,713 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. సిరిసిల్ల పట్టణంలో 65 వేలకుపైగా ఓట్లున్నాయి. లోక్​సభ ఎన్నికలో ఇక్కడ రెండు పార్టీలకు నువ్వా నేనా అన్నట్టుగా ఓట్లు పోలయ్యాయి.

ఆదిలాబాద్​ సీట్లో..

…ఆదిలాబాద్‌‌‌‌ అసెంబ్లీ పరిధిలో బీజేపీకి 62,541 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 47,056 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 1.2 లక్షల ఓట్లు ఉన్నాయి.

…ఖానాపూర్‌‌‌‌లో బీజేపీకి 47,320 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 30,481 ఓట్లు వచ్చాయి. మున్సిపాలిటీలో 12 వేలకుపైగా ఓట్లుండగా.. ఇక్కడా బీజేపీ బలంగా ఉంది.

…నిర్మల్‌‌‌‌లో బీజేపీకి 61,172 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 45,384 ఓట్లు పోలయ్యాయి. ఈ టౌన్​లో 65 వేలకుపైగా ఓట్లున్నాయి.

… ముథోల్‌‌‌‌లో బీజేపీకి 75,036 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 44,099 ఓట్లు వచ్చాయి. ఈ సెగ్మెంట్​ పరిధిలోని భైంసా మున్సిపాలిటీలో 30 వేల వరకు ఓట్లున్నాయి. ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచే బీజేపీకి ఎక్కువ పోటీ ఎదురయ్యే అవకాశముంది.

పాలమూరు సీట్లో..

…పాలమూరు ఎంపీ సీటును టీఆర్ఎస్​ గెలుచుకున్నా అక్కడ బీజేపీ గట్టిపోటీయే ఇచ్చింది. దీంతో ఇక్కడి మున్సిపాలిటీలపైనా ఆసక్తి నెలకొంది.

…మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్​లో బీజేపీకి 59,566 ఓట్లురాగా, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 55,005 ఓట్లు వచ్చాయి. ఇక్కడి మున్సిపాలిటీ పరిధిలో బీజేపీకే మెజార్టీ దక్కింది.

… మక్తల్‌‌‌‌ అసెంబ్లీ పరిధిలో బీజేపీకి 54,687 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 52,633 ఓట్లురాగా.. దీనిలో ఉన్న మక్తల్‌‌‌‌, కోస్గి మున్సిపాలిటీల్లో బీజేపీ బలమైన రాజకీయ పక్షంగా ఉంది.

…నారాయణపేటలో బీజేపీకన్నా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 1,211 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. స్థానిక మున్సిపాలిటీలో బీజేపీ ప్రాబల్యమే ఎక్కువగా కనిపిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎట్లా?

…లోక్​సభ ఎన్నికల ఓట్ల సరళిని పరిశీలిస్తే.. నిజామాబాద్‌‌‌‌ ఎంపీ సీటు పరిధిలోని ఆర్మూర్‌‌‌‌, భీమ్‌‌‌‌గల్‌‌‌‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై బీజేపీ భారీ ఆధిక్యాన్ని చూపింది.

… ఆదిలాబాద్‌‌‌‌ ఎంపీ పరిధిలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా ఆదిలాబాద్‌‌‌‌, నిర్మల్‌‌‌‌, భైంసా, ఖానాపూర్‌‌‌‌లలో బీజేపీ మెజార్టీ సాధించగా.. కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌లో మాత్రమే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు మెజార్టీ లభించింది.

….కరీంనగర్‌‌‌‌ ఎంపీ పరిధిలో కరీంనగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌తో పాటు చొప్పదండి, కొత్తపల్లి, వేములవాడలో బీజేపీ.. హుజూరాబాద్‌‌‌‌, జమ్మికుంట, హుస్నాబాద్‌‌‌‌, సిరిసిల్లల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆధిక్యం కనబరిచింది.

….మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ సీట్లోని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, మక్తల్‌‌‌‌ మున్సిపాలిటీల్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించగా.. నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చింది.

….గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్​ పరిధిలోని మేడ్చల్‌‌‌‌ – మల్కాజిగిరి జిల్లాలో ఉన్న నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలతో పాటు వికారాబాద్‌‌‌‌ జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలోనూ బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.