దుబ్బాక రిజల్ట్​తో టీఆర్ఎస్ సైలెన్స్​..

దుబ్బాక రిజల్ట్​తో టీఆర్ఎస్ సైలెన్స్​..
  •     లీడర్లు రావట్లే.. క్యాడర్​పోవట్లే
  •     ఎందుకిట్లాయెనని మథనం.. అదే రిపీటైతదేమోనని భయం

వరంగల్రూరల్‍, వెలుగుదుబ్బాక బై ఎలక్షన్​ రిజల్ట్​ కారు పార్టీని ఒక్కసారిగా కామ్ అయ్యేలా చేసింది. పదో తేదీన ఫలితాలు వచ్చాక టీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ ప్రెస్‍మీట్‍ పెట్టారు. ‘విజయాలకు పొంగిపోం, గర్వపడం.. అపజయాలకు కుంగిపోం’ అని మాట్లాడారు. కానీ గ్రౌండ్‍ లెవల్​లో వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. పార్టీ కేడర్‍ మొత్తం డల్‍ అయిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్​కు ఇంత పెద్ద దెబ్బ తాకడం ఓ విధంగా ఇదే మొదటిసారి కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలు కార్యకర్తల వరకు అంతా నారాజ్ అయ్యారు. రిజల్ట్​ ఎఫెక్ట్​ కాస్తా రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎలక్షన్‍ ప్రచారంపై పడింది. టీఆర్‍ఎస్‍ పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లు రెండు రోజులుగా ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రచారంలో పాల్గొనడం లేదు. ఫలితాల ముందువరకు కాలికి బలపం కట్టుకొని తిరిగిన లీడర్లెవరూ బయటకు రాకపోవడంతో క్యాడర్ కూడా కదలడం లేదు.

కేసీఆర్‍ అండ్‍ ఫ్యామిలీ ఇలాఖా కావడంతో..

మొదట్లో దుబ్బాక బైఎలక్షన్​ను జనాలు ఓ ప్రాంతానికి చెందిన అంశంగానే చూశారు. తీరా ఎలక్షన్లకు పదిరోజుల ముందు అక్కడ పాలిటిక్స్​ఒక్కసారిగా హీటెక్కాయి. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల రిజల్ట్​ సైతం ట్వంటీ ట్వంటీ మ్యాచ్‍ తరహాలో నిమిష నిమిషానికి టెన్షన్‍కు గురిచేసి చివరకు బీజేపీ క్యాండిడేట్‍ రఘునందన్‍ విన్‍ అయ్యారు. ఇప్పుడు దీని ప్రభావం స్టేట్‍ మొత్తం కనిపిస్తోంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్​లో కేసీఆర్ కూతురు కవిత, కరీంనగర్‍లో వారి దగ్గరి చుట్టం బోయినపల్లి వినోద్ కుమార్ ఓటమి పాలయ్యారు.  అది గులాబీ పార్టీకి కొంత షాక్‍ ఇచ్చినట్లయినా కవర్‍ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏదో గాలివాటంగా గెలిచారు తప్పించి.. కాషాయం  పార్టీకి అంతా సీన్​ లేదంటూ విమర్శలు చేశారు. అది తప్పన్నట్లుగా.. ఈసారి ఏకంగా రాష్ట్ర సీఎం, టీఆర్‍ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండ్‍ ఫ్యామిలీ సొంత ఇలాఖాలో ఓటమిని  పార్టీ లీడర్ల నుంచి క్యాడర్​ వరకు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇతర ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఫుల్​జోష్‍

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే గ్రాడ్యుయేట్‍ ఎలక్షన్లపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమితో టీఆర్ఎస్​లీడర్లు నారాజ్​కాగా, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు మాత్రం ఫుల్లు ఖుషీగా ఉన్నారు. వరంగల్‍, నల్గొండ, ఖమ్మంతో పాటు హైదరాబాద్‍, రంగారెడ్డి, మహబూబ్‍నగర్‍లో ఇతర పార్టీలకు చెందిన క్యాండిడేట్లు మరింత జోష్‍తో జనాల్లోకి వెళ్తున్నారు. టీఆర్‍ఎస్‍ ఓటమి.. ఒక్క బీజేపీనే కాకుండా కాంగ్రెస్‍, వామపక్ష పార్టీలు ఇతర ఎమ్మెల్సీ అభ్యర్థులైన ప్రొఫెసర్‍ కోదండరామ్‍, రాణిరుద్రమ వంటి క్యాండిడేట్లకు బూస్టింగ్‍ ఇచ్చినట్లయింది. మూడు రోజులుగా వారు క్యాంపెయిన్‍ స్పీడ్‍ పెంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్‍ఎస్‍కు ఇదే తీర్పు వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్‍, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల కోసం నిన్నమొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు, సమావేశాలు నిర్వహించారు. టీఆర్‍ఎస్‍ పార్టీ పల్లా రాజేశ్వర్‍రెడ్డి పేరును తమ అభ్యర్థిగా అనౌన్స్​ చేయకున్నా..అన్‍ అఫిషియల్‍గా డిక్లేర్‍ చేసిన నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆయన ప్రచారంలో బిజీ గా ఉన్నారు. దుబ్బాక రిజల్ట్​ అనంతరం ఆయన సైతం ఎక్కడా కనపడలేదు. బుధవారం వరంగల్‍ అర్బన్‍ జిల్లాలో ఓ కార్యక్రమం కోసం మంత్రులు ఇంద్రకరణ్‍రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍ వచ్చినా దుబ్బాక టాపిక్‍ మాట్లాడటానికి ఇష్టపడలేదు. వరంగల్​ అర్బన్​ జిల్లాలో గురువారం వ్యవసాయ, మార్కెటింగ్‍శాఖ మినిష్టర్‍ నిరంజన్‍రెడ్డి పర్యటన ఉండగా.. చివరి నిమిషంలో అది కూడా క్యాన్సిలైంది.