దేశంలో ఎక్కడా ఇంటింటికీ నీళ్లు ఇస్తలేరు

దేశంలో ఎక్కడా ఇంటింటికీ నీళ్లు ఇస్తలేరు
  • దేశంలో ఎక్కడా ఇంటింటికీ నీళ్లు ఇస్తలేరు: కేటీఆర్ 
  • త్వరలోనే కొత్త పింఛన్లు ఇస్తమన్న మంత్రి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: కొలువుల ముచ్చట ఏందని తాను పలుసార్లు కేంద్రానికి లేఖలు రాశానని,  తాను ప్రశ్నించడంతోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. వెంకట్రావ్ పల్లిలో గ్రామ పంచాయతీ భవనం, కేసీఆర్ ప్రగతి భవనం, చీకోడులో డిజిటల్ క్లాసులు, సీసీ కెమెరాలు, గూడెంలో పీఏసీఎస్​ గోదాం, షాపింగ్​కాంప్లెక్స్ ​ప్రారంభించారు. ముస్తాబాద్​లో పోటీ పరీక్షల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘మన రాష్ట్ర పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నయ్. మనం ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు.. దేశంలో ఎక్కడా ఇస్తలేరు. త్వరలోనే కొత్త పించన్లు మంజూరు చేస్తాం. ఇండ్లు లేని పేదలకు నిర్మించి ఇస్తాం. సొంత జాగలు ఉన్నోళ్లకు సాయం చేస్తం” అని కేటీఆర్ చెప్పారు. 

మళ్లా మా ప్రభుత్వమే..

‘‘కరోనా టైంలో  సంక్షేమ పథకాలు ఆపలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వాదిస్తారు. వచ్చేది టీఆర్ఎస్ ​ప్రభుత్వమే” అని కేటీఆర్ అన్నారు. కాగా, పోతుగల్ గ్రామంలో కాకతీయ వంశస్తులు నిర్మించిన సీతారామచంద్ర స్వామి, శివాలయాలను పునఃనిర్మించగా, విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని, పట్టు బట్టలు సమర్పించారు.