
రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ మున్సిపోల్స్ లో ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారన్నారు. ఎల్లుండి జరిగే కరీంనగర్ ఎన్నిక సహా 90 శాతానికి పైగా సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగిందనే సమాచారం వస్తోందని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ లు ,కార్పొరేషన్లలో ఓటర్లు బ్రహ్మాండంగా స్పందించారని ఆయన అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో అభివృద్ధి ,సంక్షేమ ఎజెండా కు, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ పనితీరు కు లభించబోతున్న విజయమిదని ఆయన అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఫెయిల్ అయ్యారన్న పల్లా.. ఫలితాల రోజు విపక్షాలకు ఆశాభంగం తప్పదని విమర్శించారు. తెలంగాణ సమాజం నాడి పసిగట్టడం లో ప్రతిపక్షాలు మరోమారు విఫలమయ్యాయన్నారు రాజేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్ పై అచంచల విశ్వాసం ప్రదర్శించిన తెలంగాణ ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.