బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులతో తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని బెల్లంపల్లికి చెందిన టీఆర్ఎస్​మహిళా నేత తోడె పద్మారెడ్డి అన్నారు. చిన్నయ్య శనివారం రాత్రి 10.03 గంటలకు తనకు ఫోన్​ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ.. నిన్నూ నీ కుటుంబాన్ని లేపేస్తానని వార్నింగ్​ ఇచ్చాడని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్​కు ఆదివారం కంప్లైంట్​ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికాలో ఉంటున్న తన పెద్ద కొడుకు వెంకటకృష్ణారెడ్డి బెల్లంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల గురించి ఇటీవల మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్​ద్వారా కంప్లైంట్​ చేశాడన్నారు. దీంతో కక్షగట్టిన ఎమ్మెల్యే చిన్నయ్య మంచిర్యాలలో ఉన్న తనకు ఫోన్​ చేసి ‘దమ్ముంటే నీ కొడుకును అమెరికా నుంచి బెల్లంపల్లికి రప్పించు.. వాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్త. వాడు ఏం మెసేజ్​లు పెడుతున్నాడు’ అంటూ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ చంపుతానని  బెదిరించాడని చెప్పారు. వెంటనే తాను వాట్సప్ ద్వారా మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్​కు ప్రాణభయం ఉందని కంప్లైంట్​ చేశానన్నారు. స్పందించిన ఏసీపీ గౌతమినగర్​లోని తమ ఇంటి వద్దకు బ్లూకోల్ట్​పోలీసులను రక్షణగా పంపించారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి తమ ఇంటికి రాగా పోలీసులు వారి వివరాలు తీసుకుని పంపించారని తెలిపారు. గతంలో కూడా మూడుసార్లు ఎమ్మెల్యే పీఏ గడ్డం భీమాగౌడ్, అనుచరులు సాన శ్రావణ్, మరికొందరు మీ ఫ్యామిలీని లేపేస్తామని, ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​దగ్గర కత్తితో చీరేస్తామని బెదిరించారని కంప్లైంట్​లో పేర్కొన్నారు.  తనకు, ఇద్దరు కొడుకులకు రక్షణ కల్పించాలని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై లీగల్​యాక్షన్​ తీసుకోవాలని పోలీసులను కోరారు. పద్మారెడ్డి కంప్లైంట్​పై ఎంక్వైరీ చేస్తున్నామని డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి చెప్పారు. 

గతంలోనూ ఎమ్మెల్యేపై ఆరోపణలు 

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గతంలోనూ పలువురిని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. నాలుగేండ్ల కిందట బెల్లంపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​పై అవిశ్వాసం సందర్భంగా కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుకు ఫోన్​ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి బెదిరించడం అప్పట్లో సంచలనం కలిగించింది. గతంలో పంచాయతీరాజ్​ డీఈఈపై నోరు పారేసుకున్నారు. బెల్లంపల్లిలో ఆరె వరలక్ష్మి భూమి విషయంలో తలదూర్చి విమర్శలపాలయ్యారు. కొన్ని నెలల కిందట మంచిర్యాల మున్సిపల్​ కాంగ్రెస్​ ఫ్లోర్​లీడర్​ఉప్పలయ్య ఎమ్మెల్యే చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు కంప్లైంట్​ చేశారు.