మోడీకే భయపడం..  సీబీఐ ఎంత?

మోడీకే భయపడం..  సీబీఐ ఎంత?

ఎన్నికల సంఘం ఎవరి కోసం పనిచేస్తున్నదో చూస్తున్నం: కేటీఆర్

  •     సీఈసీలోని బుద్ధిలేని అధికారిని తొలగించాలా.. ఆర్ ఓని  తొలగించాలా?
  •     పలివెలలో ఎవరి తలలు పగిలాయో వీడియోలు చూస్తే తెలుస్తదన్న మంత్రి

హైదరాబాద్‌, వెలుగు: తాము మోడీకే భయపడబోమని, ఆయన వేటకుక్క సీబీఐకి ఎందుకు భయపడుతామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘‘ఎలక్షన్‌ కమిషన్‌ ఎట్లా పనిచేస్తున్నదో చూస్తూనే ఉన్నాం. అభ్యర్థుల గుర్తుల నుంచి మంత్రిపై ప్రచార ఆంక్షల వరకు వాళ్లు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై బీజేపీ అభ్యర్థి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందామని ఈసీ చెప్పింది. ఆయన కొడుకు డబ్బులు వేస్తే తండ్రికి సంబంధం లేదంటే ఎట్లా? అయినా ఈసీ ఇచ్చే సర్టిఫికేషన్‌ కాదు.. ప్రజలు ఇచ్చే తీర్పే ముఖ్యం’’ అని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ల ఎన్నికల షెడ్యూల్‌ ఒకేసారి ఇవ్వాల్సి ఉండగా, ప్రధాని గుజరాత్‌లో పనులు చేసుకునేందుకు ఈసీ 60 రోజుల గడువిచ్చిందని ఆరోపించారు. తీసేసిన గుర్తును తెచ్చిన సీఈసీలోని బుద్ధిలేని తెలంగాణ వ్యవహారాలు చూసే అధికారిని తొలగించాలా.. లేక రిటర్నింగ్‌ అధికారిని తొలగించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలు మునుగోడులో హడావుడి చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

లబ్ధి పొందడానికి ఏదైనా చేస్తరు

మునుగోడులోని పలివెలలో ఎవరి తలలు ఎవరు పగులగొట్టారో వీడియోలు చూస్తే తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు.‘‘మరో 48 గంటలు కావాలనే కెలికి గొడవలు సృష్టిస్తారు. సానుభూతితో లబ్ధి పొందడానికి ఏదైనా చేస్తారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మంచివి కావు. బీజేపీ నేతలే రాజాసింగ్‌లా పత్తర్‌సింగ్‌లు. వాళ్లే గొడవకు కారకులు’’ అని ఆరోపించారు. మహిళలు గ్యాస్‌ బండకు దండం పెట్టుకొని మోడీకి బుద్ధి చెప్పాలన్నారు. నీళ్లిచ్చిన పార్టీకి అండగా నిలుస్తారో, కన్నీళ్లు మిగిల్చిన పార్టీ వెంట ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. మునుగోడు ప్రజలు ఆగం కావొద్దని, అన్నీ ఆలోచించుకొని ఓటు వేయాలని కోరారు. ఓటు వజ్రాయుధమని.. మోసగాళ్లు, మొనగాళ్లకు మధ్య జరుగుతున్న పోటీలో మొనగాళ్లమైన తమకు మద్దతు ఇవ్వాలన్నారు. రైతులు, నేతన్నలు, గీత కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు.

డబ్బు మదంతో తెచ్చిన ఎన్నిక
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గినా దేశంలో మోడీ చమురు ధర పెరుగుతూనే ఉందని కేటీఆర్ విమర్శించారు. మతం పేరుతో చిచ్చుపెట్టే చిల్లర రాజకీయం కావాలా.. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. బడా కాంట్రాక్టర్‌, బీజేపీ వందల కోట్లతో ఓటర్లను కొనగలం అన్న ధీమాతోనే ఈ ఉప ఎన్నిక తెచ్చారని, ఓటుతో వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. కాంట్రాక్టర్‌ తెల్లంగీ వేసుకున్నంత మాత్రాన నాయకుడు కాలేడని, డబ్బు మదంతో ఈ ఎన్నిక తెచ్చారని ఆరోపించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమిదన్నారు. బీజేపీ నేతలు మొదట టీఎన్‌జీవోలను అవమానించారని, ఇప్పుడు కొంతమంది పిల్లలను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ పూర్తి చేసి ఉంటే మన ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేసుకునేవారిమని చెప్పారు. ఎన్నికలు పూర్తికాగానే చండూరు రెవెన్యూ డివిజన్‌ సహా ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.