ప్రధాని మోడీని ప్రశ్నించిన కేటీఆర్ 

ప్రధాని మోడీని ప్రశ్నించిన కేటీఆర్ 

హైదరాబాద్, వెలుగు: పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట పైనుంచి తన వైఖరేంటో చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలు ఉచితాలు అంటే ఏమిటో క్లారిటీ ఇవ్వాలని కోరారు. ప్రధాని మోడీ ఇటీవల కాలంలో ఉచితాలు వద్దంటూ మాట్లాడుతున్నారని, పేదల పొట్ట కొట్టడానికి వేస్తోన్న కొత్త పాచిక ఇది అని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై ఇంత అక్కసు ఎందుకు? పేదలకు ఇస్తే ఉచితాలు.. కార్పొరేట్లు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా? కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానామా?’’ అని అందులో ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను ప్రధాని టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల రుణాలు మాఫీ చేయొద్దు కానీ, కార్పొరేట్ల మొండి బకాయిలను ఎన్పీఏల పేరుతో మాఫీ చేయొచ్చా? అని ప్రశ్నించారు.   

80 లక్షల కోట్లు ఏం చేసిన్రు? 

మోడీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందని కేటీఆర్ అన్నారు. మోడీ కన్నా ముందు ఉన్న 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోడీ ఎనిమిదేండ్లలోనే రూ.80 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ ఆదాయంలో 37 శాతం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని కాగ్ హెచ్చరించిందన్నారు. ఇన్ని అప్పులు చేసిన మోడీ.. ఆ డబ్బును ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఉచిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్తారా అని ప్రశ్నించారు.