
- మోడీ కామెంట్లపై రోడ్డెక్కిన టీఆర్ఎస్, కాంగ్రెస్.. కౌంటర్‌గా బీజేపీ..
- రాష్ట్రాన్ని మోడీ కించపరుస్తున్నరు: టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైర్....ప్రధాని దిష్టిబొమ్మల దహనం
- టీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొడ్తున్నది: బీజేపీ ..కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
- జనగామలో టీఆర్ఎస్, బీజేపీ ఫైట్.. తొమ్మిది మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు
ప్రధాని అడ్డంగా మాట్లాడుతున్నరు
ఎనిమిదేళ్ల కిందట జరిగి పోయినదాన్ని పట్టుకొని ప్రధాని మోడీ అడ్డంగా మాట్లాడుతున్నరు. విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నరు. ఒక నోరు‑ రెండు నాలుకలు అనేలా గతంలో మాట్లాడినట్లే.. ఇప్పుడు కూడా అర్థరహితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కించపరిచేలా మాట్లాడిన్రు.
‑ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్‌ను విమర్శిస్తే టీఆర్ఎస్కు నొప్పేంది?
రాష్ట్ర విభజన టైమ్‌లో కాంగ్రెస్ అనుసరించిన తీరును ప్రధాని మోడీ విమర్శిస్తే టీఆర్ఎస్ నేతలకు నొప్పేంది. కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టే, ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, విభజన బిల్లును ప్రధాని ఎక్కడైనా వ్యతిరేకించారా? పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడికి పోయారు? ఓటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ మద్దతుతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందనే విషయం గుర్తుంచుకోవాలి.
‑ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
తెలంగాణ వ్యతిరేకి మోడీ
రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్‌తోనే జరిగిందని, అందులో టీఆర్ఎస్పాత్ర ఏమీలేదని ప్రధాని మోడీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం ద్వారా స్పష్టమైంది. తెలంగాణపై బీజేపీ ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది. మోడీ కామెంట్స్ అమరుల
ఆత్మ క్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా ఉన్నాయి. ప్రజలకు మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలి.
‑ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం మూడు ప్రధాన పార్టీలు పోటా పోటీ నిరసనలకు దిగాయి. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించాయి. దిష్టిబొమ్మలు దహనం చేశాయి. ఏపీ విభజన తీరుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ టీఆర్ఎస్ లీడర్లు రోడ్డెక్కారు. ఆందోళనల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును, ఎదుగుదలను ఓర్వలేకే పార్లమెంట్ సాక్షిగా మోడీ విషం కక్కారని వారు ఆరోపించారు. బీజేపీ లీడర్లు, కార్యకర్తలను గ్రామాల్లోంచి తరిమికొట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునివ్వగా.. ‘బీజేపోళ్లను ఉరికిచ్చికొడ్తం..దమ్ముంటే రండి’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ నిరసనలు జరిగాయి. కౌంటర్‌గా బీజేపీ నేతలు.. పలు చోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. విభజన పై ప్రధాని చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ లీడర్లు కావాలనే వక్రీకరిస్తున్నారని, ఆయన ఎక్కడ కూడా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని బీజేపీ నేతలు అన్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నదని, మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. జనగామలో పోటా పోటీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. దాడుల వరకు వెళ్లాయి.
జనగామ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కొట్లాట జరిగింది. మోడీ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు జెండా కట్టెలతో కొట్టారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మొదట.. మోడీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. హైదరాబాద్ రోడ్ లోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంపు ఆఫీస్ నుంచి మొదలైన టీఆర్ఎస్ బైక్ ర్యాలీ చౌరస్తాకు చేరుకుంది. దీంతో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘మోడీ డౌన్ డౌన్’ అని టీఆర్ఎస్ శ్రేణులు.. ‘కేసీఆర్ డౌన్‌డౌన్’ అంటూ బీజేపీ శ్రేణులు నినాదాలు చేసుకున్నారు. ఏసీపీ కృష్ణ, సీఐ బాలాజీ వరప్రసాద్తమ బలగాలతో ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు కొంత మంది బీజేపీ లీడర్లను అదుపులోకి తీసుకుని లింగాల ఘన్పూర్ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన బీజేపీ లీడర్లను టీఆర్ఎస్ నాయకులు జెండా కట్టెలతో కొడుతూ హైదరాబాద్ రోడ్ వైపు తరిమారు. డీసీపీ సీతారాం సంఘటన స్థలానికి చేరుకుని ఇరు పార్టీల లీడర్లను అక్కడి నుంచి పంపించేశారు. ఘటనలో బీజేపీ కార్యకర్తలు మహిపాల్, కోట వినోద్, బాలకృష్ణా రెడ్డి, క్రాంతి, నవీన్, ఆంజనేయులు, కార్తీక్ రెడ్డి, అశోక్, రాజు, వరాల మధు గాయపడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి డీసీపీకి ఫిర్యాదు చేశారు. గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు పరామర్శించారు. గాయపడ్డవారిని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫోన్లో పరామర్శించారు. దాడులకు నిరసనగా.. గురువారం జనగామలో బీజేపీ మౌనదీక్ష చేపట్టనుంది.
మోడీ క్షమాపణ చెప్పాలి: మంత్రులు
హైదరాబాద్‌లో కేసీఆర్ స్వాగతం పలకడానికి రాలేదన్న మంటతోనే ప్రధాని పార్లమెంట్లో తెలంగాణపై కామెంట్లు చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ఆరోపించారు. హన్మకొండలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చావును కూడా లెక్క చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటును సుష్మాస్వరాజ్ తప్ప మిగతా బీజేపీ లీడర్లు వ్యతిరేకించారని ఆరోపించారు. ‘బీజేపోళ్లను ఉరికిచ్చికొడ్తం..దమ్ముంటే రండి’ అంటూ ఫైర్ అయ్యారు. వనపర్తిలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధానికి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిచేయాలన్నారు. నిర్మల్‌లో జరిగిన ఆందోళనలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అమరులైన యువకుల బలిదానాన్ని పార్లమెంట్ సాక్షిగా మోడీ అపహాస్యం చేశారని, ఇందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్ పీఎం మోడీ దిష్టిబొమ్మ దహనంలో పాల్గొని మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని మోడీ ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని మోడీ శనిలా దాపురించారని మంత్రి జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ప్రధాని అవమానించారని, రాష్ట్రాన్ని అవహేళన చేస్తే బీజేపీ ప్రభుత్వంపై తిరగబడతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ నుంచి నల్ల బ్యాడ్జీలు, నల్లా జెండాలతో టీఆర్ఎస్ నేతలు గన్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. మోడీ వ్యాఖ్యల్లో భారీ కుట్ర దాగుందని, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉమ్మడి రాష్ట్రం చేయాలని చూస్తున్నారని తలసాని ఆరోపించారు. అజంపురా చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.
గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నిరసన
ప్రధాని మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ గాంధీ భవన్ ముందు స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీత ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఓయూలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు.. మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్యర్యంలో మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం హైకోర్టు ఆవరణలో నిరసన చేసింది.
ప్రధాని మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ లీడర్లు కావాలనే వక్రీకరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. టీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నదని, రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన కామెంట్ల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మోడీ ఎక్కడ కూడా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్నే తప్పుబట్టారన్నారు. టీఆర్ఎస్కు పోటీగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజ్యాంగం మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నుంచి జనాల్ని పక్కదోవ పట్టించేందుకే మోడీ అంశాన్ని టీఆర్ఎస్ నేతలు తెరపైకి తెచ్చారని ఖమ్మంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నిర్మల్‌లో బీజేపీ నేత రావుల రాంనాథ్ తదితరులు ఆరోపించారు.