విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు... స్టడీ, వర్క్ వీసాలకు టైం లిమిట్

విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు... స్టడీ, వర్క్ వీసాలకు టైం లిమిట్
  • ఇకపై నాలుగేండ్లకు మించి ఉండొద్దంటూ కొత్త రూల్ 
  • జర్నలిస్టులకు, ఎక్చేంజ్ ప్రోగ్రాం విజిటర్లకూ టైం పీరియడ్ 
  • హెచ్‌1 బీ వీసా ప్రోగ్రామ్.. పెద్ద స్కామ్, దాన్ని మార్చాలి: అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్

వాషింగ్టన్: వీసా రూల్స్‌‌ను అమెరికా మరింత కఠినతరం చేసింది. విదేశీ విద్యార్థులు (ఎఫ్‌‌ వీసా), ఫారిన్ జర్నలిస్టులు (ఐ వీసా), ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌‌ కింద వచ్చే విజిటర్ల(జే వీసా)కు టైమ్‌‌ పీరియడ్‌‌ విధించింది. ఇకపై వీళ్లంతా అమెరికాలో నాలుగేండ్లకు మించి ఉండేందుకు వీల్లేకుండా నిబంధనలు సిద్ధం చేసింది. ఈ మేరకు డిపార్ట్‌‌మెంట్ ఆఫ్‌‌ హోమ్‌‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌‌ఎస్) ప్రతిపాదనలు రూపొందించింది. వీటిని బుధవారం మీడియాకు విడుదల చేసింది. ఈ మూడు కేటగిరీల కింద వచ్చే వాళ్లకు ప్రస్తుతానికి టైమ్‌‌ పీరియడ్ లేదు. వీళ్లకు ‘డ్యూరేషన్‌‌ ఆఫ్‌‌ స్టే’ వెసులుబాటు ఉంది. 

అంటే వాళ్లు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్‌‌ ప్రోగ్రామ్‌‌లో పాల్గొనాలనుకుంటే.. అంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు గరిష్టంగా నాలుగేండ్ల కాల పరిమితి విధించిన అక్కడి ప్రభుత్వం.. అంతకుమించి ఉండాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని రూల్‌‌ తీసుకొచ్చింది. అలాగే ఫారిన్ జర్నలిస్టులు (ఐ వీసా) 240 రోజులు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అర్హులు. మరో 240 రోజులు వీసాను పొడిగించుకోవచ్చు. కాగా, ప్రస్తుతం ఎఫ్‌‌, జే, ఐ వీసాదారులు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండడంతో వాళ్లపై నిఘా ఉండడం లేదని డీహెచ్‌‌ఎస్‌‌ పేర్కొంది. అందుకే రూల్స్‌‌ను మారుస్తున్నట్టు తెలిపింది. 

హెచ్‌‌1బీ వీసా ప్రోగ్రామ్.. పెద్ద స్కామ్: లుట్నిక్ 

హెచ్‌‌1బీ వీసా ప్రోగ్రామ్‌‌ పెద్ద స్కామ్‌‌ అని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌‌ లుట్నిక్ అన్నారు. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ప్రస్తుతమున్న హెచ్‌‌1బీ వీసా సిస్టమ్‌‌.. ఒక స్కామ్. ఇది అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టేందుకు ఉపయోగపడుతున్నది. ఇకపై అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడమే అమెరికన్ బిజినెస్‌‌మెన్ ఫస్ట్ ప్రయార్టీ కావాలి. ఇప్పుడు అమెరికన్లను నియమించుకునే సమయం ఆసన్నమైంది” అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్‌‌’లో లుట్నిక్  పోస్టు పెట్టారు. 

‘‘హెచ్‌‌1బీ వీసా ప్రోగ్రామ్‌‌ను మేం మార్చనున్నాం. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. అలాగే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ కల్పించే గ్రీన్‌‌కార్డ్‌‌ ప్రాసెస్‌‌ను కూడా మార్చనున్నాం. సగటు అమెరికన్ ఏడాదికి 75 వేల డాలర్లు సంపాదిస్తాడు. అదే సగటు గ్రీన్‌‌కార్డ్ హోల్డర్ మాత్రం 66 వేల డాలర్లు సంపాదిస్తాడు. అంత అట్టడుగు స్థాయి వాళ్లకు గ్రీన్‌‌కార్డ్ ఎందుకు ఇవ్వాలి? అందుకే ట్రంప్ గోల్డ్‌‌ కార్డ్ తీసుకొచ్చారు. ఇకపై మేం గొప్పవాళ్లను మాత్రమే తీసుకుంటాం” అని తెలిపారు. కాగా, హెచ్‌‌1బీ వీసాలపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా విమర్శలు చేశారు. ‘‘హెచ్‌‌1బీ వీసా పేరుతో కంపెనీలు గేమ్‌‌ ఆడుతున్నాయి. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ విదేశీయులను నియమించుకుంటున్నాయి” అని అన్నారు.