ట్రంప్ డబుల్ గేమ్.. మోదీ నా ఫ్రెండ్ అంటూనే.. ఇండియాపై 100% టారిఫ్లు వేయాలని ఈయూపై ఒత్తిడి

ట్రంప్ డబుల్ గేమ్.. మోదీ నా ఫ్రెండ్ అంటూనే.. ఇండియాపై 100%  టారిఫ్లు వేయాలని ఈయూపై ఒత్తిడి
  • రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు ఆపాలని డిమాండ్

న్యూఢిల్లీ / వాషింగ్టన్: ఇండియా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు ఇండియా తనకు మిత్ర దేశం అంటూనే.. టారిఫ్​లపై ఇతర దేశాలను ఎగదోస్తున్నారు. ఇండియాపై 100% టారిఫ్​లు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు మంగళవారం (సెప్టెంబర్ 09) సూచించారు. 

ఆ తర్వాత.. కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీతో టారిఫ్​పై చర్చిస్తామని ట్రూత్ సోషల్​లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యపరమైన అడ్డంకులు తొలగిస్తామని చెప్తూనే.. మరిన్ని టారిఫ్​లు విధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రష్యా నుంచి ఇక క్రూడాయిల్ కొనుగోలు చేయమని ఇండియా ప్రకటించేదాకా సుంకాలు విధిస్తూనే ఉండాలని ఈయూకు సూచించారు. 

వాషింగ్టన్​లో మంగళవారం ఈయూ అధికారులతో ట్రంప్‌‌ కాన్ఫరెన్స్‌‌ కాల్‌‌లో మాట్లాడారు. రష్యాకు నిధులు అందకుండా చేయాలన్న అంశంపై వారితో చర్చించారు. రష్యా చేతిలో డబ్బు లేకపోతే ఉక్రెయిన్​పై దాడి చేయలేదని నిర్ధారణకు వచ్చారు. అందుకే.. ఇండియా, చైనా ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చి ఉక్రెయిన్​తో యుద్ధం ముగించాలని భావిస్తున్నట్లు ఈయూకు అమెరికా స్పష్టం చేసింది. రష్యా నుంచి భారత్, చైనాలు భారీగా క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాయని విమర్శించారు. 

ఉక్రెయిన్​పై యుద్ధానికి రష్యాకు పరోక్షంగా ఈ రెండు దేశాలే సహాయపడుతున్నాయని మండిపడ్డారు. క్రూడాయిల్ కొనుగోలు చేయగా వచ్చిన డబ్బులతోనే రష్యా ఆయుధాలు, మిసైళ్లు తయారు చేసి ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాను ఒంటరిని చేయాలనే ఉద్దేశంతో చైనా, ఇండియాపై భారీ టారిఫ్​లు విధించాలని ఈయూ ప్రతినిధులను అమెరికా కోరింది. దీనిపై ఈయూ సీనియర్ అధికారి స్పందిస్తూ.. అమెరికా అదనపు టారిఫ్​లు విధించేందుకు సిద్ధమైతే.. తాము కూడా భారీగా సుంకాలు వేస్తామని స్పష్టం చేశాడు.

ఈయూ సపోర్ట్​తో మరిన్ని సుంకాలకు ప్లాన్

రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు ఈయూ అధికారులు తెలిపారు. రష్యాపై ఒత్తిడి తీసుకురావాలనే ట్రంప్ ఆలోచనా సరైందే అని చెప్పారు. దీని కోసం ఇండియా, చైనాపై అదనపు టారిఫ్ విధించడమే ఏకైక మార్గమని తెలిపారు. ఇరు దేశాలపై అదనపు టారిఫ్​లు విధిస్తే జరిగే పరిణామాలపై కూడా అమెరికా అధికారులతో యూరోపియన్ యూనియన్ దేశాల ప్రతినిధులు చర్చించారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై ఇండియా, చైనాలపై ట్రంప్‌‌ కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్నాడు. 

ఇప్పటికే ఇండియాపై 50 శాతం టారిఫ్ విధించారు. ఇటీవల ఎస్​సీవో సమిట్​లో భాగంగా ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌‌, రష్యా అధినేత పుతిన్‌‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇది ట్రంప్​ను మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో ఇండియా, చైనా లక్ష్యంగా భారీ టారిఫ్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్రంప్​తో మాట్లాడుతా: మోదీ

డొనాల్డ్​ ట్రంప్​ పోస్టుపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘‘నేను కూడా ట్రంప్‌తో మాట్లాడేం దుకు ఎదురుచూస్తున్నాను. ఇండియా, అమెరికా మంచి ఫ్రెండ్స్.. మంచి పార్ట్నర్స్’’ అంటూ ట్వీట్​ చేశారు. అమెరికా, ఇండియా మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. అమెరికాతో ట్రేడ్ డీల్​కు సంబంధించిన చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు ఇండియన్ టీమ్ కృషి చేస్తున్నదని తెలిపారు.