ట్రంప్తో మమ్దానీ భేటీ.. ‘మిస్టర్ మేయర్’ అంటూ మమ్దానీని సంబోధించిన ట్రంప్

ట్రంప్తో మమ్దానీ భేటీ.. ‘మిస్టర్ మేయర్’ అంటూ మమ్దానీని సంబోధించిన ట్రంప్

వాషింగ్టన్: న్యూయార్క్ సిటీ కాబోయే మేయర్  జోహ్రాన్  మమ్దానీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ తో భేటీ అయ్యారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ లోని ఓవల్  ఆఫీసులో వారిద్దరూ సమావేశమై వివిధ​అంశాలపై చర్చించారు. న్యూయార్క్  సిటీ మేయర్ గా ఎన్నికైన మమ్దానీకి ముందుగా ట్రంప్  అభినందనలు తెలిపారు. 

‘మిస్టర్  మేయర్’ అంటూ మమ్దానీని సంబోధించారు. న్యూయార్క్  మేయర్ గా మమ్దానీ పూర్తికాలం ఉంటారని జోస్యం చెప్పారు. భేటీ అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. న్యూయార్క్లో పెరుగుతున్న జీవనవ్యయం, నిత్యావసరాల ధరలు, అఫొర్డబిలిటీ (కొనుగోలు శక్తి) పై ఫోకస్ పెట్టామని ట్రంప్, మమ్దానీ తెలిపారు. నిత్యావసర, హౌసింగ్ ధరలను తగ్గించడంపై ఆలోచిస్తానని ట్రంప్  తెలిపారు.

మమ్దానీ ఐడియాలు కొన్ని తన ఐడియాలాగే ఉన్నాయని పేర్కొన్నారు. తాను అనుకున్న దాని కన్నా ఎక్కువ విషయాలపై మమ్దానీతో అంగీకరించానని అన్నారు. తన మద్దతుదారులు కొందరు మమ్దానీకి ఓటు వేశారని ట్రంప్  చెప్పారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జీవనవ్యయం తన టాప్ ప్రయారిటీగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా.. డెమోక్రటిక్  నేత అయిన మమ్దానీతో ట్రంప్  భేటీ కావడాన్ని ప్రజలతో పాటు పలు రాజకీయ నేతలు కూడా ఆసక్తిగా గమనించారు.