ట్రంప్.. మనసులో ఇంత పెట్టుకున్నవా: భారత్‎పై అమెరికా సుంకాల వెనక అసలు కారణం ఇదా..?

ట్రంప్.. మనసులో ఇంత పెట్టుకున్నవా: భారత్‎పై అమెరికా సుంకాల వెనక అసలు కారణం ఇదా..?

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. వద్దని చెప్పినా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం, బ్రిక్స్ కూటమిలో సభ్య దేశం కావడంతోనే భారత్‎పై టారిఫ్స్ విధించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బయటికి చెబుతున్నప్పటికీ.. దీనికి వెనక ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భారత్‎పై అమెరికా సుంకాల విధింపుపై కొత్త విషయాన్ని  వెలుగులోకి తీసుకొచ్చారు మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్.

జాతీయ వార్త సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వికాస్ స్వరూప్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని ఇండియా చెప్పడం భారత్‎పై అమెరికా అదనపు సుంకాలు విధించడానికి ఒక ముఖ్య కారణమని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నప్పటికీ భారత్ మాత్రం ఖండిస్తూ వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షిక చర్చల ద్వారానే జరిగిందని.. మూడో వ్యక్తి/దేశ ప్రమేయం లేదని ఇండియా తేల్చి చెప్పింది. 

సీజ్ ఫైర్ విషయంలో భారత్ తనకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో నొచ్చుకున్న ట్రంప్.. ఇండియాపై యడాపెడా అదనపు సుంకాలు విధించాడని చెప్పారు వికాస్ స్వరూప్. భారత్ బ్రిక్స్ కూటమిలో భాగస్వామ్యం కావడం కూడా ట్రంప్ ఇండియాపై టారిఫ్‎లు విధించడానికి మరో కారణమన్నారు. బ్రిక్స్ అమెరికన్ వ్యతిరేక కూటమి అని.. డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నదనే భావనలో ట్రంప్ ఉన్నారని.. ఇలాంటి కూటమిలో ఇండియా భాగస్వామ్యం కావొద్దని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. 

Also Read : జడ్జ్ ఇంట్లో దొంగలు.. 4 నిమిషాల్లో 5 లక్షలు, బంగారం స్వాహా

పాకిస్తాన్‌తో అమెరికా ప్రస్తుత సంబంధాన్ని స్వల్పకాలిక , వ్యూహాత్మక ఒప్పందంగా పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా-భారత్ సంబంధాలు వ్యూహాత్మకంగానే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలలో ట్రంప్ పరిపాలన ఒత్తిడికి తలొగ్గకూడదనే న్యూఢిల్లీ నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ట్రంప్ సుంకాలు చివరికి అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తాయని హెచ్చరించారు.