కళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించా.. 5 గంటల్లోనే యుద్ధం ఆపేశారు: ఇండియా-పాక్ వార్‎పై ట్రంప్

కళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించా.. 5 గంటల్లోనే యుద్ధం ఆపేశారు: ఇండియా-పాక్ వార్‎పై ట్రంప్

వాషింగ్టన్: ఇండియా-పాక్ వార్‎పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాత పాట పాడారు. తన వల్లే ఇండియా పాక్ యుద్ధం ఆగిపోయిందని ప్రగల్భాలు పలికారు. లేదంటే అణు యుద్ధం జరిగేదని గొప్పలు చెప్పుకున్నారు. అమెరికా కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్--పాక్ యుద్ధం తానే ఆపానని  చెప్పుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కఠినమైన వ్యక్తి భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశానని.. ఇండియా పాకిస్థాన్ మధ్య ఏం జరుగుతోందని మోడీని ప్రశ్నించానని చెప్పారు ట్రంప్. 

మోడీతో మాట్లాడాక పాక్ నేతలతోనూ చర్చించానని.. అప్పటికే భారత్ పాక్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. దీంతో వెంటనే యుద్ధం ఆపకుంటే వాణిజ్య ఒప్పందాలు ఉండవని రెండు దేశాలను హెచ్చరించానని.. అమెరికా విధించే భారీ టారిఫ్‎లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని చెప్పారు. ఇలా తాను హెచ్చరించిన 5 గంటల్లోనే యుద్ధం ఆగి అంతా సద్దుమణిగిందని గొప్పలు చెప్పుకున్నారు. 

2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసింది. ఉగ్రమూకలు 26  మంద పర్యాటకులను విచక్షణరహితంగా కాల్చి చంపారు. మతం అడిగి మరీ ఒకే వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేసుకుని హతమార్చారు. పహల్గాం టెర్రర్ ఎటాక్‎కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 

ఈ మిషన్లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు ఎక్కడ నేలమట్టం చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సిందూర్‎కు కౌంటర్ గా పాక్ ప్రతిదాడులు చేయడంతో ఇండియా పాక్  మధ్య సైనిక ఘర్షణ మొదలైంది. ఇరుదేశాల డ్రోన్లు, మిస్సైళ్లతో ఎటాక్ చేసుకున్నాయి. భారత్ దెబ్బకు తోకముడిచిన పాక్.. కాల్పుల విరమణ ఒప్పందం అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాలు ద్వైపాక్షిక చర్చలు జరిపి కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

 అయితే.. ట్రంప్ తన మాత్రం తన వల్లే ఇండియా  పాక్ వార్ ఆగిందని పలుమార్లు క్లెయిమ్ చేసుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశ లేదా వ్యక్తి ప్రమేయం లేదని.. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సీజ్ ఫైర్ కుదిరిందని ట్రంప్ వ్యా్ఖ్యలకు కౌంటర్ ఇస్తూ వస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం నేనే  యుద్ధం ఆపానంటూ గొప్పలు చెప్పుకోవడం ఆపడం లేదు.