
- బలవంతపు రాజీనామాలు, ఉద్యోగ విరమణలు
- ఖర్చులు తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం.. పొలిటికో ఏజెన్సీ వెల్లడి
వాషింగ్టన్: నాసాలో పనిచేస్తున్న సుమారు 2 వేల మందికి పైగా సీనియర్ ఉద్యోగులను తొలగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిసైడ్ అయ్యారని పొలిటికో అనే ఏజెన్సీ తెలిపింది. సీనియర్ లెవల్ గవర్నమెంట్ (జీఎస్ 13 నుంచి జీఎస్ 15) ర్యాంకుల్లో ఉన్నవాళ్లనే ట్రంప్ టార్గెట్ చేసినట్లు వివరించింది. కొన్ని దశాబ్దాల అనుభవం ఉన్నవాళ్లను కూడా పక్కనపెట్టే ఆలోచనలో ఉన్నట్లు పొలిటికో డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతున్నది. బడ్జెట్‌లో కోతల కారణంగానే నాసాలో ఈ తొలగింపులు జరపనున్నట్లు సమాచారం.
పదవీకాలం పూర్తికాకుండానే రిటైర్మెంట్ తీసుకునేలా ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరిని బాయ్‌కాట్ చేస్తారని, ఇంకొందరితో బలవంతంగా రాజీనామా చేయించేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు పొలిటికో ఏజెన్సీ తెలిపింది. 2,145 ఉద్యోగుల్లో సుమారు 1,818 మంది సైన్స్, హ్యుమన్ స్పేస్ ఫ్లైట్ వంటి కోర్ మిషన్లలో వర్క్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మిషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్ర మరియు మంగళ గ్రహ మిషన్‌ల వంటి కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు.
2026 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్‌లో నాసా ఫండింగ్‌ను 25% వరకు తగ్గించేందుకు వైట్ హౌస్ ప్రతిపాదించింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ కోత 47% వరకు ఉంటుందని తెలుస్తున్నది. 10 నాసా రీజినల్ సెంటర్లలో పని చేస్తున్న వారిని తొలగించాలని నిర్ణయించింది. ఈ లే ఆఫ్‌ల కారణంగా కీలక మిషన్‌లైన ఆర్టెమిస్ 2 (2026లో చంద్రునిపై మనిషిని దింపడం), మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్‌లపై ప్రభావం ఉంటుంది. సీనియర్ ఇంజనీర్లు, సైంటిస్టులు నాసాను వీడితే ఈ ప్రయోగాలు ఆలస్యం, లేదంటే రద్దయ్యే అవకాశాలున్నాయి.
1,353 డిప్లమాట్లు, ఆఫీసర్లకు ఉద్వాసన
ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లో తీసుకున్న నిర్ణయం మేరకు.. 1,107 మంది సివిల్ సర్వెంట్లు, 246 మంది ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లకు ఉద్వాసన పలకనున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వీరిలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లకు లేఆఫ్ నోటీసులు ఇచ్చిన తర్వాత 120 రోజుల అడ్మినిస్ట్రేటివ్ లీవ్ పై పంపనున్నారు. అలాగే సివిల్ సర్వెంట్లకు 60 రోజుల సపరేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వీరంతా ఉద్యోగాలను కోల్పోనున్నారు.