
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఈ రెండు దేశాలపై 50 నుంచి 100% వరకు టారిఫ్లు విధించాలని ట్రంప్ ప్రభుత్వం జీ7 దేశాలను కోరుతున్నది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు త్వరలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఆర్థిక మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి క్రూడాయిల్ అమ్మకాలే పెద్ద ఆదాయ వనరని.. భారత్, చైనాలు రష్యా చమురు కొనడం వల్లనే పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడని అమెరికా ఆరోపిస్తున్నది. ఈ సుంకాలతో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి, శాంతి చర్చలకు ఒత్తిడి తేవాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నది.
టారిఫ్లు వేస్తే ఈయూకే నష్టం
అయితే భారత్, చైనాపై భారీగా టారిఫ్లు విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ (ఈయూ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే ఆర్థిక నష్టం, ప్రతీకార చర్యలు ఎదురవుతాయని ఈయూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.