ఆల్ టైమ్ ఆశలకు ట్రంప్ రెసిస్టెన్స్.. ఐటీ, టెలికం షేర్ల పతనంతో మార్కెట్ ఫాల్

ఆల్ టైమ్ ఆశలకు ట్రంప్ రెసిస్టెన్స్.. ఐటీ, టెలికం షేర్ల పతనంతో మార్కెట్ ఫాల్

ముంబై: ఐటీ, టెలికం షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సెన్సెక్స్‌‌, నిఫ్టీ గురువారం (జులై 11) సుమారు అర శాతం పడ్డాయి.  ట్రంప్ టారిఫ్ పాలసీలతో గ్లోబల్‌‌గా అనిశ్చితి నెలకొంది.  ఇన్వెస్టర్ల  సెంటిమెంట్‌‌  దెబ్బతింటోంది. సెన్సెక్స్ గురువారం (జులై 10) 345.80 పాయింట్లు (0.41శాతం) నష్టపోయి 83,190.28 వద్ద, నిఫ్టీ 120.85 పాయింట్లు (0.47శాతం) తగ్గి 25,355.25 వద్ద ముగిశాయి. 

బీఎస్‌‌ఈలో 2,064 షేర్లు నష్టపోగా, 1,959 షేర్లు పెరిగాయి. ఐటీ, ఫైనాన్స్ సెక్టార్ల నుంచి క్యూ1 ఫలితాలు మెప్పించకపోవచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని జియోజిత్ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ ఎనలిస్ట్‌‌  వినోద్ నాయర్ అన్నారు. భారతీ ఎయిర్‌‌టెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి షేర్లు గురువారం నష్టపోగా, మారుతి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. 

బీఎస్‌‌ఈ మిడ్‌‌క్యాప్ 0.28శాతం తగ్గగా, స్మాల్‌‌క్యాప్ 0.12శాతం పెరిగింది. టెక్, టెలికం, ఐటీ సూచీలు  క్షీణించాయి. రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్‌‌  గ్యాస్ లాభపడ్డాయి. అమెరికాతో వాణిజ్య చర్చల కోసం భారత బృందం వాషింగ్టన్‌‌కు వెళ్లనుంది.  26శాతం అదనపు దిగుమతి సుంకాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఆసియా మార్కెట్లలో కొరియా, చైనా, హాంకాంగ్ లాభపడగా, జపాన్ నష్టపోయింది. ఎఫ్‌‌ఐఐలు గురువారం నికరంగా రూ.586 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.