24 గంటల్లో భారత్‎పై మరిన్ని సుంకాలు పెంచుతాం: ట్రంప్ మరోసారి బెదిరింపులు

24 గంటల్లో భారత్‎పై మరిన్ని సుంకాలు పెంచుతాం: ట్రంప్ మరోసారి బెదిరింపులు

వాషింగ్టన్: ఇప్పటికే భారత దిగుమతులపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్.. ఇండియాకు మరో షాక్ ఇచ్చాడు. భారత్‎పై వచ్చే 24 గంటల్లో వాణిజ్య సుంకాలను గణనీయంగా పెంచుతామని బిగ్ బాంబ్ పేల్చాడు. మంగళవారం (ఆగస్ట్ 5) CNBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ట్రంప్. 

భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదని, ఆ దేశంతో వ్యాపారం చాలా కష్టంగా మారిందన్నారు. భారత్ విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని.. అందుకే మేం వారితో ఎక్కువ వ్యాపారం చేయమని చెప్పారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని అవకాశంగా మల్చుకుని రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసి వ్యాపారం చేస్తోన్న ఇండియాపై వచ్చే 24 గంటల్లో వాణిజ్య సుంకాలను గణనీయంగా పెంచుతామని ప్రకటించాడు. 

ఉక్రెయిన్‎తో మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులను పట్టించుకోని భారత్.. రష్యా నుంచి అలాగే చమురు దిగుమతి చేసుకుంటోంది. తమ మాట వినని ఇండియాపై కోపం పెంచుకున్న ట్రంప్.. అమెరికాలో భారత దిగుమతులపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధించాడు. 

అమెరికా 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించడంతో తలొగ్గిన భారత్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేసిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి యధావిధిగా చమురు దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇప్పటికే విధించిన 25 శాతం కాకుండా భారత్‎పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు.