ఇండియాపై రష్యా క్రూడ్ టారిఫ్స్ తగ్గిస్తా.. గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్..

ఇండియాపై రష్యా క్రూడ్ టారిఫ్స్ తగ్గిస్తా.. గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్..

చాలా రోజులుగా యూఎస్ ఇండియా మధ్య వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనటంపై యూఎస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా పన్నులను 50 శాతానికి పెంచటంతో ఎగుమతులపై నీలి మేఘాలు అలుముకున్నాయి. అయితే ప్రస్తుతం భారత్ ట్రంప్ కోరిక మేరకు రష్యన్ ఆయిల్ దిగుమతులు తగ్గిస్తూ అమెరికా నుంచి క్రూడ్ కొనటం పెంచిన నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాతో డీల్ అతి త్వరలోనే ఉండబోతోందని.. ఇది ఆర్థిక వ్యవస్థలతో పాటు భద్రదాపరమైన బంధాలను బలపరుస్తుందని చెప్పారు. భారతదేశానికి కొత్త యూఎస్ రాయభారిగా సెర్గియో గార్ బాధ్యతలకు సంబంధించి ఓవల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఫెర్ ట్రేడ్ డీల్ గురించి కామెంట్ చేశారు. గతంలో జరిగిన ఒప్పందాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండనుందని ట్రంప్ అన్నారు. 

భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ స్థాయిలోనూ చాలా ముఖ్యమైనవిగా ట్రంప్ పేర్కొనటం గమనార్హం. అలాగే రానున్న కొన్ని నెలల్లో ట్రంప్ ఇండియా విజిట్ కోసం రాబోతున్నట్లు ఈ సందర్భంగా హింట్ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటం, వ్యూహాత్మకంగా సంబంధాలు మెరుగుపరుచుకోవటంపై కూడా సంతోషం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీతో తనకు మంచి స్నేహ బంధం ఉందని ట్రంప్ అన్నారు. 

ALSO READ : AI ఆధారిత తెలుగు క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌..

ప్రస్తుతం భారతదేశంపై రష్యన్ క్రూడ్ టారిఫ్స్ కారణంగా సుంకాలు అధికంగా ఉన్నాయి. అయితే భారత్ దిగుమతులు తగ్గించటంతో అదనపు సుంకాలను కూడా తాము తగ్గించబోతున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే డీల్ ఫైనల్ అయిన తర్వాత 25 శాతం రష్యన్ చమురు కొనుగోళ్లపై విధించిన సుంకాలను వెనక్కు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.