రష్యా సమీపంలోకి అమెరికా న్యూక్లియర్ సబ్‎మెరైన్స్.. ట్రంప్ ఆదేశాలతో మరో యుద్ధం తప్పదా..?

రష్యా సమీపంలోకి అమెరికా న్యూక్లియర్ సబ్‎మెరైన్స్.. ట్రంప్ ఆదేశాలతో మరో యుద్ధం తప్పదా..?

వాషింగ్టన్: రష్యా-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పతనమైన తమ ఆర్థిక వ్యవస్థలను రష్యా, భారత్ మరింత దిగజార్చుకుంటాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇరుదేశాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి ఉప ఛైర్మన్‌గా ఉన్న దిమిత్రి మెద్వెదెవ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. రష్యాది డెడ్ ఎకానమీ అన్న ట్రంప్.. ది వాకింగ్‌ డెడ్‌ చిత్రాలను గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. 

రష్యా.. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మాదిరిగా కాదని.. తమకు పంపే ప్రతి హెచ్చరిక కూడా ముప్పేనని.. యుద్ధం వైపు ఓ అడుగని హాట్ కామెంట్స్ చేశారు. మెద్వెదెవ్‌ వ్యాఖ్యలపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు మూర్ఖపు, రెచ్చగొట్టే మాటలని విమర్శించారు. మెద్వెదేవ్ చేసిన మూర్ఖపు, రెచ్చగొట్టే బెదిరింపులకు ప్రతిస్పందనగా రష్యా భూభాగం సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారకూడదని తాను ఆశిస్తున్నానని చెప్పారు. 

రష్యా సమీపంలో న్యూక్లియర్ సబ్ మెరైన్స్‎ను మోహరించామన్న ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ప్రతినిధి విక్టర్ వోడోలాట్స్కీ లైట్ తీసుకున్నారు. రష్యాకు ఇప్పటికే మహాసముద్రాలపై ఉన్నతమైన వ్యూహాత్మక నియంత్రణ ఉందని కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ మహాసముద్రాలలో అమెరికా కంటే రష్యన్ అణు జలాంతర్గాముల సంఖ్య చాలా ఎక్కువని గుర్తు చేశారు. రష్యా సమీపంలో మోహరించాలని ట్రంప్ ఆదేశించిన రెండు అణు జలాంతర్గాములు చాలా కాలంగా మా నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 

కాగా, రష్యా-అమెరికా మధ్య పరిస్థితులు మాటలు ధాటి యాక్షన్ వరకు వెళ్లడంతో ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది. ఏకంగా రష్యాకు సమీపంలో అణు జలంతర్గాములు మోహరించాలని డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వడంతో ఆ రెండు దేశాల మధ్య అసలేం జరుగుతోందని ఆందోళన నెలకొంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్‎తో యుద్ధం చేస్తోన్న రష్యా.. ఇప్పుడు అమెరికాతో కూడా వార్‎కు దిగుతుందా..? ఇదే జరిగితే వరల్డ్ వార్-3 తప్పదా అని ప్రపంచదేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.