
- అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన
- లోకల్ బిజినెస్ పెంచేలా నిర్ణయం
- వ్లాదిమిర్ పుతిన్, జెలెన్ స్కీ
- ‘ఆయిల్, వెనిగర్’ లాంటి వాళ్లని..
- త్వరగా కలవరని కామెంట్
వాషింగ్టన్ డీసీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్బాంబు పేల్చారు. వచ్చే 50 రోజుల్లో ఫర్నిచర్ తయారీ రంగంపైనా టారిఫ్ లు విధించనున్నట్టు ప్రకటించారు. వివిధ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఫర్నిచర్ పై సుంకాల విషయంపై ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తోందని ఆయన శుక్రవారం తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు.
ఈ ఇన్వెస్టిగేషన్ 50 రోజుల్లోగా పూర్తవుతుందని, ఆ తర్వాత అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్ పై తగిన మేరకు టారిఫ్ లను నిర్ణయిస్తామన్నారు. అమెరికాలోని నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాలు, మిషిగన్, ఇతర రాష్ట్రాల్లో ఫర్నిచర్ బిజినెస్ తిరిగి పుంజుకునేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. కాగా, అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం, గత జులై నాటికి 3.40 లక్షల మంది ఫర్నిచర్ తయారీ రంగంలో ఉన్నారు. అమెరికాలోకి ప్రస్తుతం చైనా, వియత్నాం నుంచి ఎక్కువగా ఫర్నిచర్ దిగుమతి అవుతోంది.
గత ఏడాది దాదాపు 25.5 బిలియన్ డాలర్ల విలువైన ఫర్నిచర్ ను విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకున్నదని గణాంకాలు చెప్తున్నాయి. కాగా, స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై ఇప్పటికే టారిఫ్ లను ప్రకటించిన ట్రంప్ సర్కార్.. ఫార్మా, కంప్యూటర్ చిప్స్, క్రిటికల్ మినరల్స్ వంటి అనేక ఉత్పత్తులపై టారిఫ్ లు వేయడంపైనా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అయితే, ఈ ఇన్వెస్టిగేషన్ కు కొన్ని నెలల సమయం పడుతుందని, చివరగా టారిఫ్ లను సమర్థించుకునేలా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ పై రెండు వారాల్లో నిర్ణయం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆయిల్, వెనిగర్ లాంటి వారని, వారు అంత త్వరగా కలవరని ట్రంప్ కామెంట్ చేశారు. శుక్రవారం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ లోని అమెరికన్ ఫ్యాక్టరీపై గురువారం రష్యా దాడి చేయడం పట్ల తాను అసంతృప్తితో ఉన్నానన్నారు.
ఆ యుద్ధానికి సంబంధించి ఏ విషయంపైనా తాను సంతోషంగా లేనన్నారు. ‘‘ఫస్ట్ పుతిన్, జెలెన్ స్కీ సమావేశమవుతారని.. శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారని చూస్తున్నాం. మరో రెండు వారాలపాటు వేచి చూశాక, దీనిపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాం. రష్యాపై ఆంక్షలు లేదంటే టారిఫ్ లు భారీగా పెంచుతాం. లేదంటే సైలెంట్ గా ఉండిపోయి, వారి ఇష్టమొచ్చినట్టు పోరాటం చేసుకోవాలని చెప్తాం” అని వెల్లడించారు.
‘‘మీకు తెలుసు. ఆయిల్, వెనిగర్ మాదిరిగా వాళ్లిద్దరూ కలవడం కొంచెం కష్టం. నిజం చెప్పాలంటే రష్యా, ఉక్రెయిన్ అటిట్యూడ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే, రెండు వారాల తర్వాత ఈ విషయంపై ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాం” అని ట్రంప్ తెలిపారు.