- బల్క్‌గా ఆయిల్ దిగుమతి చేసుకుని ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నది: ట్రంప్
- ఇండియా భారీ లాభాలు పొందుతున్నది
- రష్యా, ఉక్రెయిన్ వార్‌కు పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నదని విమర్శ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని సుంకాలు విధిస్తానని బెదిరించాడు. ఇండియా.. ఆయిల్ బిజినెస్ చేస్తున్నదని ఆరోపించారు. రష్యా నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుని.. దాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నదని అన్నారు. ఇలా ఇండియా పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నదని విమర్శించారు. ఈ మేరకు ఆయన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేసి ఉక్రెయిన్‌పై యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నదని ఆరోపించారు. రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారని, అవేమీ ఇండియాకు పట్టడం లేదని విమర్శించారు. ఇండియా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఎంత చెప్పినా వినిపించుకోకపోవడం వల్లే తొలుత 25 శాతం టారిఫ్ విధించినట్లు చెప్పారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని సుంకాలు వేస్తామని హెచ్చరించారు. ఇండియాలో అమెరికా వస్తువులపై భారీగా పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. కాగా, ఇప్పటికే ఇండియాపై ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించారు. ఆగస్టు 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. అమెరికా విధించిన 25 శాతం టారిఫ్.. ఇండియన్ ఎకానమిపై అంత పెద్ద ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
మా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఇండియా మోసం చేస్తున్నది: ట్రంప్ సన్నిహితుడు మిల్లర్
అమెరికా ఇమిగ్రేషన్ విధానాన్ని ఇండియా మోసం చేస్తున్నదని ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ ఆరోపించారు. అమెరికా తమకు మిత్ర దేశమని ఇండియా చెప్పుకుంటున్నా.. తమ ప్రొడక్ట్స్‌ను మాత్రం కొనుగోలు చేయడం లేదని, తమ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఇమిగ్రేషన్ రూల్స్, ముఖ్యంగా హెచ్1బీ వీసా, డాక్యుమెంట్లేని ఇమిగ్రెంట్ల విషయంలో తమ కార్మికులకు నష్టం కలిగిస్తున్నదని ఫైర్ అయ్యారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపాలని ట్రంప్ సూచించినా ఇండియా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
