గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటం: డొనాల్డ్ ట్రంప్

గ్రీన్ లాండ్ ను  స్వాధీనం చేసుకుంటం: డొనాల్డ్ ట్రంప్
  •     రష్యా బెదిరింపులకు డెన్మార్క్  కౌంటర్  వేయలేకపోయిందని విమర్శ
  •     8 యుద్ధాలు ఆపినా నోబెల్ రాలేదని కామెంట్

వాషింగ్టన్: గ్రీన్​లాండ్​ను త్వరలో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  స్పష్టం చేశారు. ఈరోజు కాకుంటే రేపైనా అది జరిగి తీరుతుందని పేర్కొన్నారు. రష్యా బెదిరింపులకు డెన్మార్క్​ కౌంటర్  వేయలేకపోయిందని ఆరోపించారు. ఈమేరకు ఆయన తన ట్రూత్  సోషల్​లో పోస్టు చేశారు. ‘‘గ్రీన్ లాండ్​కు రష్యా నుంచి ముప్పు పొంచి  ఉందని నాటో గత 20 ఏండ్లుగా డెన్మార్క్​కు చెబుతూనే ఉంది. కానీ, ఆ విషయాన్ని డెన్మార్క్ పెడచెవిన పెట్టింది. రష్యా బెదిరింపులకు డెన్మార్క్  కౌంటర్ వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో గ్రీన్​లాండ్​ను అమెరికా స్వాధీనం చేసుకునే టైమొచ్చింది” అని ట్రంప్  వ్యాఖ్యానించారు. అలాగే, తనకు నోబెల్ శాంతి బహుమతి నిరాకరించడంతో ప్రపంచ వ్యవహారాలను తాను చూసే విధానం మారిందని ఆయన చెప్పారు. ఎనిమిది యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై శాంతి గురించి ఆలోచించేది లేదని, తన దేశానికి ఏది మంచిదో అది మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. ఈమేరకు నార్వే ప్రధాని జోనస్ గర్​ స్టోర్ కు ట్రంప్  లేఖ రాశారు. ట్రంప్​కు నోబెల్  బహుమతి రాకపోవడంతో ఆయన నిరాశలో కూరుకుపోయారని, ఈ నేపథ్యంలో గ్రీన్​లాండ్​ను స్వాధీనం చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నారని స్టోర్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై ట్రంప్  ఈవిధంగా స్పందించారు. ‘‘నేను ఎనిమిదికిపైనే యుద్ధాలు ఆపినా.. నాకు నోబెల్  శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం (నార్వే)  నిర్ణయించుకుంది. ఇక శాంతి గురించి నేను ఆలోచించాల్సిన అవసరంలేదని అనిపిస్తోంది. నా దేశానికి ఏది మంచిదో దాని గురించే ఆలోచిస్తా” అని ట్రంప్  స్పష్టం చేశారు. కాగా.. ట్రంప్  నుంచి తనకు వచ్చిన లేఖ నిజమేనని నార్వే ప్రధాని స్టోర్  తెలిపారు.

నోబెల్ కోసం ఎందుకంత ఆరాటం: ఐయాన్

అహంకారంతోనే గ్రీన్​లాండ్​ను స్వాధీనం చేసుకోవాలని  కోరుకుంటున్నారని డొనాల్డ్  ట్రంప్​పై యురేషియా గ్రూప్ అధ్యక్షుడు ఐయాన్ బ్రెమర్  మండిపడ్డారు. సోమవారం ఓ టీవీ చానెల్​తో ఆయన మాట్లాడారు. ట్రంప్ కు ఐడెంటిటీ క్రైసిస్  బాగా ముదిరిందని ఆయన విమర్శించారు. ‘‘ప్రతి దానిపై తన పేరు ఉండాలని ట్రంప్‌‌‌‌  కోరుకుంటున్నారు. కెన్నడీ సెంటర్​ను ట్రంప్  సెంటర్​గా మార్చాలని పట్టుబడుతున్నాడు. నోబెల్  శాంతి బహుమతి కోసం తీవ్రంగా పాకులాడుతున్నాడు. ఎందుకు అంత పాకులాట? తనది కాని వస్తువులపైనా తన పేరు ఉండాలనుకుంటున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించినపుడు క్రెడిట్  తీసుకుంటే బాగుంటుంది. కానీ, మనదికాని వాటిపై ఆధిపత్యం ప్రదర్శించి పైశాచిక ఆనందం పొందడం ఏంది?” అని బ్రెమర్  వ్యాఖ్యానించారు. అసలు గ్రీన్​లాండ్​ను స్వాధీనం చేసుకోవడానికి గల భద్రతాపరమైన కారణాలను ట్రంప్  పాలకవర్గంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారని ఆయన తెలిపారు.

గ్రీన్​లాండ్ మిత్రదేశాలపై టారిఫ్​లేంటి?: స్టార్మర్

గ్రీన్​లాండ్ మిత్రదేశాలపై ట్రంప్​ టారిఫ్​లు విధించడంపై బ్రిటన్  ప్రధాని కీర్  స్టార్మర్  తీవ్రంగా మండిపడ్డారు. అది పూర్తిగా తప్పని ఖండించారు. లండన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరూ టారిఫ్ వార్​ను కోరుకోవడం లేదన్నారు. గ్రీన్​లాండ్, డెన్మార్క్  ప్రాథమిక హక్కుకు బ్రిటన్  మద్దతు తెలుపుతుందని, ఆర్కిటిక్  ఐలాండ్  భవిష్యత్తును నిర్ణయించే అధికారం వాటికి ఉందని తెలిపారు.