అమెరికా ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ట్రంప్ టారిఫ్స్ తర్వాత రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంపైనా లేనట్టుగా 50 శాతం సుంకాలను అమలు చేయటంపై మోడీ సర్కార్ కూడా గుర్రుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చైనాతో స్నేహహస్తం ప్రకటించటం యూఎస్ ప్రతినిధులకు అస్సలు మింగుడుపడటం లేదు.
అయితే తాజాగా ఇండియాపై టారిఫ్స్ సరేనవే అంటూ ట్రంప్ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియా అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు దశాబ్ధాలుగా ఏకపక్షంగానే కొనసాగుతున్నాయంటూ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఢిల్లీ వాషింగ్టన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయంటూ భారత దూకుడు వైఖరిని నెమ్మదింపజేసే కామెంట్స్ చేశారు. ట్రంప్ ప్రధానంగా ఇండియాతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ పై ఫోకస్ చేసినట్లు ఆయన కామెంట్స్ ద్వారా అర్థమౌతోంది.
ALSO READ : ఇస్రో మొట్టమొదటి స్వదేశీ చిప్ విక్రమ్ 32..
చాలా ఏళ్లుగా భారత్ అమెరికా నుంచి దిగుమతులపై, యూఎస్ వస్తువులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. దీంతో అసమతుల్య వాణిజ్య వాతావరణం ఏర్పడిందని చెప్పారు. కానీ చాలా సంవత్సరాలుగా భారతదేశంతో ఏకపక్ష సంబంధాలు ఉన్నాయని అన్నారు. అమెరికా నుంచి వచ్చే వస్తువులు, సేవలపై భారత్ ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని తన మనసులో మాట బయటపెట్టారు ప్రెసిడెంట్ ట్రంప్. కొన్ని యూఎస్ ఉత్పత్తులపై ఏకంగా 100 శాతం టారిఫ్స్ ఇండియా విధించటాన్ని ట్రంప్ ఈ సందర్భంగా తప్పుపట్టారు.
భారత్ తమపై భారీగా టారిఫ్స్ విధించినా తాము అలా చేయలేదు కాబట్టే తమతో వ్యాపారం కొనసాగిస్తోందని అన్నారు. ఈ పరిస్థితులపై ఒక ఉదాహరణ ఇచ్చిన ట్రంప్.. అమెరికన్ మోటార్ సైకిల్ కంపెనీ హార్లే డేవిడ్సన్ ఉదాహరణను ఉటంకిస్తూ, భారతదేశంలోకి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం అమలు చేస్తోందని, ఇది తమ కంపెనీలకు ఇండియాలో వ్యాపారం చేయటం సవాలుగా చేసిందన్నారు. హార్లే డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి అక్కడ ఒక మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా విధిస్తున్న సుంకాలను తప్పించుకోవటానికి చైనా, మెక్సికో, కెనడా నుంచి వేలాది కంపెనీలు తమ ఉత్పత్తిని యూఎస్ లో స్టార్ట్ చేస్తున్నాయని ట్రంప్ అన్నారు.
