
- ఉక్రెయిన్ పై యుద్ధం ఆగితే.. టారిఫ్ ల తగ్గింపుపై ఆలోచిస్తాం
- రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపైనా 100% సుంకాలు
- చైనాపైనా అదనపు సుంకాలు వేస్తామన్న యూఎస్ ప్రెసిడెంట్
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోతే ఇండియాపై మరిన్ని సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే 50 శాతం టారిఫ్ లు విధించామని, గురువారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయన్నారు. ఉక్రెయిన్‌తో 50 రోజుల్లో (సెప్టెంబర్, 2025 నాటికి) రష్యా శాంతి ఒప్పందం చేసుకోవాలని.. లేకపోతే రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 100 శాతం టారిఫ్ వసూలు చేస్తామన్నారు. రష్యా ఆయిల్‌ను డైరెక్ట్‌గా లేదంటే ఇన్ డైరెక్ట్‌గా ఏవైనా దేశాలు కొనుగోలు చేస్తున్నాయా? అని నిర్ధారించాల్సిందిగా అధికారులను ఆదేశించానని తెలిపారు. వైట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైనా వంటి దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండగా.. ఇండియానే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ఓ జర్నలిస్ట్ ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇండియాపై టారిఫ్ విధించి 8 గంటలే గడిచాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ఇంకా చాలా చూడబోతున్నారు. మరిన్ని సుంకాలు ఉంటాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే మరిన్ని దేశాలపై కూడా అదే చేయొచ్చు. అందులో చైనా కూడా ఉండొచ్చు. నేను వద్దన్నా.. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేస్తున్నది. అందుకే 50 శాతం టారిఫ్ లు విధించాల్సి వచ్చింది’’ అని ట్రంప్ అన్నారు.
చైనాపైనా అదనపు టారిఫ్‌లు!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగితే.. ఇండియాపై విధించిన టారిఫ్‌లను వెనక్కి తీసుకుంటారా? అని పలువురు జర్నలిస్టులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘అలా జరిగే అవకాశం ఉంది’ అని అన్నారు. అయితే, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న చైనాపైనా సుంకాలు విధిస్తారా? అని ట్రంప్‌ను జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. ‘‘రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉంది. చైనాపై 30 శాతం టారిఫ్ ఉంది. కొనుగోళ్లు ఆపకపోతే చైనాపై కూడా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది’’అని ట్రంప్ చెప్పారు. కాగా, ఉక్రెయిన్, రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతిత్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశం కానున్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
టారిఫ్‌లతో లక్షల కోట్లు వస్తయ్
అమెరికాను అడ్డం పెట్టుకుని చాలా దేశాలు లబ్ధి పొందాయని, భారీగా లాభపడ్డాయని ట్రంప్ అన్నారు. టారిఫ్‌లతో అవే దేశాల నుంచి అమెరికాకు తిరిగి లక్షలాది కోట్లు వస్తాయని తెలిపారు. పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించడాన్ని సమర్థించుకున్నారు.