వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై మీనమేషాలు లెక్కిస్తూ.. దాడులు చేసుకుంటున్న ఆ రెండు దేశాలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను అమెరికా ప్రెసిడెంట్ గా గెలిస్తే.. రష్యా, ఉక్రెయిన్ వార్ ను కొన్ని గంటల్లోనే ఆపేలా చూస్తానన్న ఆయన.. ఇప్పుడు ఏడాది కావస్తున్నా, ప్రేక్షకపాత్రకే పరిమితం కావాల్సి రావడంతో ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు.
వైట్ హౌస్ లో ట్రంప్ ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో గత ఒక్క నెలలోనే 25 వేల మంది చనిపోయారని అన్నారు. వీరిలో ఎక్కువ మంది సోల్జర్లు ఉన్నారని చెప్పారు. రెండు దేశాలు విరోధాన్ని పక్కనపెట్టి వెంటనే యుద్ధం ఆపాలని కోరుకుంటున్నానని, అందుకోసం గట్టిగానే కృషి చేస్తున్నామన్నారు. ఇలాంటి పోరాటాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని, అలా జరగడం చూడాలని అనుకోవట్లేదని అన్నారు. అయితే,
సెక్యూరిటీ అగ్రిమెంట్ ప్రకారం.. ఉక్రెయిన్‌కు తాము మిలిటరీ సహాయాన్ని కొనసాగిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే అమెరికా రూపొందించిన శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ సిద్ధంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘శాంతి ఒప్పందం కోసం రష్యా, ఉక్రెయిన్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేయడానికే తాను మీటింగ్ పెట్టాల్సి రావడం పట్ల ట్రంప్ అసహనంతో ఉన్నారు. అందుకే ఇకపై అలాంటి సమావేశాలు పెట్టేందుకు, చర్చించేందుకు ఆయన ఇష్టపడటంలేదు” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా వెల్లడించారు.
కాగా, నాలుగేండ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో తాము ఆక్రమించుకున్న డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను అప్పగిస్తే.. యుద్ధం విరమిస్తామని రష్యా ప్రతిపాదిస్తుండగా.. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రజలు ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని జెలెన్ స్కీ స్పష్టం చేస్తున్నారు.
ఇండియాతో కలిసి కొత్త గ్రూప్‌కు ట్రంప్ ప్లాన్?
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇండియా, చైనా, రష్యా, జపాన్ తో కలిసి అమెరికా సారథ్యంలో కొత్తగా ‘కోర్ ఫైవ్(సీ5)’ పేరుతో కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టుగా అమెరికన్ మీడియా సంస్థ ‘పొలిటికో’ ఓ కథనంలో వెల్లడించింది. ప్రస్తుత జీ7 కూటమిలో యూరప్ ఆధిపత్యం కొనసాగుతున్నందున.. ప్రపంచంలోనే కీలక శక్తులుగా ఉన్న ఇండియా, చైనా, రష్యా, జపాన్‌లతో అమెరికా కలిసి ఒకే వేదికపైకి రావాలని ఆయన యోచిస్తున్నారని తెలిపింది.
వైట్ హౌస్ గురువారం పబ్లిష్ చేసిన ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’ నివేదికకు ఈ ప్లాన్ కూడా ఒక సీక్రెట్ వెర్షన్‌గా ఉందని పేర్కొంది. ట్రంప్ ప్రతిపాదించిన ఈ సీక్రెట్ ప్లాన్ గురించి తమకు కచ్చితమైన సమాచారం అందిందని ‘డిఫెన్స్ వన్’ మీడియా సంస్థ వెల్లడించినట్టుగా వివరించింది. కోర్ ఫైవ్ కూటమిలోకి ఈ ఐదు దేశాలతోపాటు 10 కోట్లకు పైగా జనాభా ఉన్న పలు కీలక దేశాలను కూడా ఆహ్వానించాలని పేర్కొన్నట్టు తెలిపింది. అయితే, ఈ కథనాలను వైట్ హౌస్ ఖండించింది. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ నివేదికకు సంబంధించి ఎలాంటి సీక్రెట్ ప్లాన్లు గానీ, డాక్యుమెంట్లుగానీ లేవని స్పష్టం చేసింది.

