యుద్ధం ఆపడానికి అంగీకరించాల్సిందే.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయ్: పుతిన్‎కు ట్రంప్ వార్నింగ్

యుద్ధం ఆపడానికి అంగీకరించాల్సిందే.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయ్: పుతిన్‎కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వాద్లిమిర్ పుతిన్ 2025, ఆగస్ట్ 15న  యూఎస్‎లోని అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ కీలక సమావేశానికి ముందే పుతిన్‎కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అలస్కాలో జరిగే భేటీలో ఉక్రెయిన్‎తో యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరించకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు ట్రంప్. అలాస్కా చర్చలు విఫలమైతే రష్యాపై పలు ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్చలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగే రెండవ సమావేశానికి ఒక మెట్టుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పుతిన్‎తో జరిగే మొదటి భేటీ సఫలం అయితే.. జెలెన్ స్కీతో రెండో సమావేశం త్వరగా ఏర్పాటు చేస్తానని చెప్పారు.

 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలన విధానాల ఫలితమేనని విమర్శించారు ట్రంప్. అప్పుడు తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని.. అయినప్పటికీ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి పని చేస్తున్నానని తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో తాను ఐదు యుద్ధాలను ఆపానని. అలాగే ఇరాన్ అణు సామర్థ్యాన్ని తుడిచిపెట్టామని పేర్కొన్నారు. అమెరికా చాలా మంది ప్రాణాలను కాపాడగలిగితే అది గొప్ప విషయం అవుతోందన్నారు. 

కాగా, గత మూడేళ్లుగా నిర్విరామంగా సాగుతోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి.. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ఆగస్ట్ 15న అలస్కాలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్‎తో  సమావేశం ఏర్పాటు చేశాడు ట్రంప్. ఈ భేటీలో ఉక్రెయిన్‎తో యుద్ధాన్ని ముగించడం, శాంతి ఒప్పందం, రష్యా-అమెరికా వాణిజ్య సంబంధాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ కీలక సమావేశానికి ఒక రోజు ముందే.. పుతిన్ కచ్చితంగా యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకోవాల్సిందేనని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. మరీ ఈ భేటీతోనైనా.. మూడేండ్లుగా సాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందో లేదో చూడాలి.