అవును.. ట్రంపే ఇండియా-పాక్ వార్ ఆపారు: అదే పాత పాట పాడిన మార్కో రూబియో

అవును.. ట్రంపే ఇండియా-పాక్ వార్ ఆపారు: అదే పాత పాట పాడిన మార్కో రూబియో

వాషింగ్టన్: పాక్-భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని.. ఇరుదేశాల మధ్య మీడియేటర్‎గా వ్యవహరించి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఒకటే పాట పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ట్రంప్ పాడిన పాత రాగమే అందుకున్నారు. ట్రంపే పాక్-ఇండియా యుద్ధాన్ని ఆపారని అధ్యక్షుడి వ్యాఖ్యలను ఆయన పునరావృతం చేశారు. 

గురువారం (ఆగస్ట్ 7) 'ది వరల్డ్ ఓవర్'కి ఇంటర్వ్యూ ఇచ్చారు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. ఈ సందర్భంగా ఆయన భారత్-పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇటీవల భారత్-పాకిస్తాన్ సైనిక వివాదంలో చిక్కుకున్నప్పుడు అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అణ్వాయుధ దక్షిణాసియా దేశాల మధ్య యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపారని తెలిపారు. 

ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారని ఆయన పీస్ ప్రెసిడెంట్ అని పొగిడారు. భారత్ పాక్ వారే కాకుండా.. కంబోడియా-థాయిలాండ్,  అజర్‌బైజాన్-అర్మేనియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో-రువాండా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను కూడా మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప తీరుతో అమెరికన్లు గర్విస్తున్నారని అన్నారు.

భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ట్రంప్ చేసిన వాదనలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే పాక్‎తో సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని.. ఇందులో మూడో వ్యక్తి/దేశం ప్రమేయం లేనే లేదని ఇండియా స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ చేసిన వాదననే ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో పునరుద్ఘాటించడం శోచనీయం.