
బ్యాంకాక్/ పనామ్పెన్: కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరిపేందుకు థాయ్ లాండ్, కంబోడియా అంగీకరించాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల ప్రధానులతో తాను మాట్లాడానని, చర్చలకు వారిద్దరూ అంగీకరించారని శనివారం రాత్రి ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. చర్చలకు ముందుకు రాకుండా ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే ఆ రెండు దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోబోమని హెచ్చరించానని వెల్లడించారు.
ట్రంప్ ప్రకటన నేపథ్యంలో రెండు దేశాల ప్రధానులు కూడా ఆదివారం వేర్వేరుగా ప్రకటనలు చేశారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్ స్పందిస్తూ.. తక్షణమే, బేషరతుగా కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలకు థాయ్లాండ్ కూడా అంగీకరించిందని ట్రంప్ తనతో చెప్పారని వెల్లడించారు.
వెంటనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతోపాటు, థాయ్ లాండ్ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరపాలని ఫారిన్ మినిస్టర్ ప్రక్ సోఖోన్ను ఆదేశించానని తెలిపారు. చర్చల అంశంపై థాయ్లాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచయచయ్ కూడా స్పందించారు. ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడానని, ఇరువైపులా దాడులు ఆపి, చర్చలు జరిపేందుకు అంగీకరించానని తెలిపారు. ఈ విషయంలో ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పారు. కంబోడియా కూడా సిన్సియర్‌గా వ్యవహరించాలని కోరారు.