సీజ్ ఫైర్ పై ట్రంప్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరం..రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే

సీజ్ ఫైర్ పై ట్రంప్  వ్యాఖ్యలు  దేశానికి అవమానకరం..రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్​ మధ్య తానే సీజ్​ఫైర్​ ఒప్పందం చేయించినట్లు అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్​ మాటిమాటికి ప్రకటించుకోవడం దేశానికి అవమానకరమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఏఐసీసీ చీఫ్​, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున​ఖర్గే నిలదీశారు. ప్రధాని నరేంద్రమోదీ వెంటనే  సమాధానం చెప్పాలని ఆయనతోపాటు కాంగ్రెస్​ సభ్యులు సోమవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్​లో ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. 

పహల్గాం టెర్రర్​ దాడి యావత్​ దేశాన్ని కలచివేసిందని, టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు సైన్యం చేపట్టిన ఆపరేషన్​  సిందూర్​కు కాంగ్రెస్​ సహా అన్ని పార్టీలు పూర్తి మద్దతిచ్చాయని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్, భద్రతా లోపాలు, ఫారిన్​ పాలసీపై రెండురోజులు సభలో చర్చించాలని డిమాండ్​ చేశారు. ఇప్పటివరకు ఆ టెర్రరిస్టులను పట్టుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

అన్నింటిపై చర్చిస్తాం: నడ్డా

ఖర్గే డిమాండ్లపై సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఆపరేషన్​ సిందూర్​కు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. కాగా, ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో చైర్మన్​ జగదీప్ ధన్​ఖడ్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు  ప్రారంభమైనప్పుడు కూడా కాంగ్రెస్​ సభ్యులు ఇదే అంశంపై పట్టుబట్టారు. ఆపై కేంద్రం తీరుకు నిరసనగా.. వాకౌట్​ చేశారు. అంతకుముందు సభలో నలుగురు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.