రష్యా మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‎లు విధించడం కరెక్టే: జెలెన్‌‌స్కీ

రష్యా మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‎లు విధించడం కరెక్టే: జెలెన్‌‌స్కీ

కీవ్‌‌(ఉక్రెయిన్‌‌): రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా టారిఫ్‌‌లు విధించడం సరైందేనని ఉక్రెయిన్‌‌ ప్రెసిడెంట్‌‌ జెలెన్‌‌స్కీ అన్నారు. రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు.. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌‌ కొంటున్న దేశాలపై యూఎస్‌‌ ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్‌‌ ట్రంప్ మరిన్ని(రెండో దశ) టారిఫ్‌‌లు విధిస్తామని హెచ్చరించడాన్ని ఆయన బలంగా సమర్థించారు. రష్యా తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశంతో ఏ విధమైన వాణిజ్య ఒప్పందాలు కొనసాగరాదన్నారు. సోమవారం ఏబీసీ న్యూస్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌‌స్కీ మాట్లాడారు.

ట్రంప్‌‌ టారిఫ్‌‌ ప్లాన్‌‌ బెడిసికొట్టినట్టేనా..?

ట్రంప్‌‌ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా, చైనా ప్రెసిడెంట్లు వ్లాదిమిర్‌‌ పుతిన్‌‌, జిన్‌‌పింగ్‌‌తో ఇటీవల భేటీ అయ్యారు. దీంతో ఆ రెండు అతిపెద్ద దేశాలు డార్క్‌‌ సైడ్‌‌కు వెళ్లిపోయాయని ట్రంప్‌‌ కామెంట్‌‌ చేశారు. ట్రంప్‌‌ డార్క్‌‌ సైడ్‌‌ కామెంట్ల నేపథ్యంలో యూఎస్‌‌ ప్రెసిడెంట్‌‌ విధించిన టారిఫ్‌‌ల వ్యూహం బెడిసికొట్టినట్టేనా అని ఏబీసీ న్యూస్‌‌ ప్రతినిధి జెలెన్‌‌స్కీని ప్రశ్నించారు. 

దీనికి ఆయన స్పందిస్తూ, రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై టారిఫ్‌‌లు విధించాలన్న ఆలోచన సరైనదేనన్నారు. యుద్ధాన్ని ఆపాలంటే రష్యాతో ఏ దేశమూ వ్యాపారం చేయకూడదని స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్‌‌, రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా 985 బిలియన్‌‌ డాలర్ల ఆదాయం పొందగా..  ఇందులో భారత్‌‌, చైనా వాటానే ఎక్కువ. ఈయూ దేశాలు మాత్రం 2027 నాటికి రష్యా నుంచి దిగుమతులు పూర్తిగా బంజేయాలని ప్లాన్‌‌ చేస్కున్నాయి”అని జెలెన్‌‌స్కీ చెప్పారు.