ఆ ఎయిర్‌‌బేస్‌ను ఇవ్వకపోతే.. అంతే..! అఫ్గానిస్తాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఆ ఎయిర్‌‌బేస్‌ను ఇవ్వకపోతే.. అంతే..! అఫ్గానిస్తాన్‌కు ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్: బగ్రామ్‌ ఎయిర్‌‌బేస్‌ను అమెరికాకు తిరిగి అప్పగించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అఫ్గానిస్తాన్‌ను డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘బగ్రామ్‌ ఎయిర్‌‌బేస్‌ను అమెరికా నిర్మించింది. ఒకవేళ అఫ్గానిస్తాన్ దాన్ని తిరిగి అమెరికాకు అప్పగించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని తాలిబాన్‌ పాలకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈమేరకు శనివారం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు పెట్టారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం నిర్మించిన ఎయిర్‌‌బేస్‌ మాకు కావాలి. దీనిపై చర్చలు జరుపుతున్నాం. ఒకవేళ వాళ్లు తిరిగి ఇవ్వకపోతే, నేనేం చేస్తానో మీరే చూస్తారు” అని పేర్కొన్నారు.

ఇంచు కూడా ఇవ్వం: అఫ్గాన్ 

ట్రంప్ బెదిరింపులపై అఫ్గాన్ సర్కార్ స్పందించింది. తమ భూభాగంలో ఇంచు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. తమ దేశ స్వాతంత్ర్యం, సమగ్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. ‘‘బగ్రామ్‌ ఎయిర్‌‌బేస్‌ను తిరిగి తీసుకునేందుకు అఫ్గానిస్తాన్‌తో చర్చలు జరుపుతున్నామని కొందరు చెబుతున్నారు. కానీ ఆ డీల్ అసాధ్యం. అది మాకు అక్కర్లేదు. మా భూభాగంలో ఇంచు కూడా ఇవ్వం” అని డిఫెన్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఫసిహుద్దీన్ ఫిత్రాత్‌ పేర్కొన్నారు.