బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

బ్రిటన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆమె ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే లిజ్ ట్రస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.  

‘‘నేను దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఉన్నట్లు కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నాను’’ అని లిజ్ ట్రస్ ప్రకటించారు. కాగా, సెప్టెంబరు తొలివారంలోనే  ఆమె బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. ఈనేపథ్యంలో కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ  వచ్చే వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కారణం ఇదేనా ?

ప్రధాని లిజ్‌ ట్రస్‌ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపింది. దీంతో  ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లిజ్‌ ట్రస్‌పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.  ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన లిజ్‌ ట్రస్‌.. ‘‘ నేను తప్పిదాలు చేశాను. అందుకు క్షమించండి’’ అని రెండు రోజుల క్రితం ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈవిధంగా క్షమాపణలు కోరిన రెండు రోజుల్లోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం గమనార్హం.