కేంద్రం వరద సాయం చేసినా.. రాష్ట్ర సర్కారు ఇయ్యలే

V6 Velugu Posted on Jul 30, 2021

వెలుగు, నెట్​వర్క్: కేంద్రం వరమిచ్చినా రాష్ట్రం కనికరించట్లేదు.  తెలంగాణలో 2020 వానకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం జరిగినా ఏ ఒక్క రైతుకూ ఇప్పటివరకు ఇన్​పుట్ ​సబ్సిడీ కింద పరిహారం అందించలేదు. అదే సమయంలో గతేడాది వానకాలంలో పంట నష్టంపై ఐఎంసీటీ(ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) నివేదిక ఆధారంగా రాష్ట్రానికి  రూ. 245.96 కోట్లు ఇచ్చినట్లు  కేంద్రం తాజాగా ప్రకటించింది. 33 శాతం, అంతకన్నా ఎక్కువ పంట నష్టం జరిగిన 2.39 లక్షల హెక్టార్లకు చెందిన రైతులకు ఈ పరిహారం అందించాల్సి ఉన్నా ఇప్పటికీ ఇవ్వకపోవడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

వరి, పత్తి పంటలకు భారీ నష్టం 

గతేడాది వానకాలం సీజన్​లో కురిసిన భారీ వర్షాలు, ఆగస్టు, అక్టోబర్​ నెలల్లో వచ్చిన వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు  ప్రభుత్వానికి రిపోర్టులు పంపారు. ముఖ్యంగా అక్టోబర్​ నెల 12 నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో కోతకొచ్చిన వరి, సోయా, మొదటి కోత దశలో ఉన్న పత్తి, కంది, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి, పైనుంచి వరద నీరు పారింది. గొలకలపైనే నీళ్లు నిలిచి ఉండడంతో మొలకలు వచ్చాయి. వరి కోతలు ప్రారంభమైన జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో వడ్ల కుప్పలు మొలకెత్తాయి. వేలాది ఎకరాల్లో పత్తిచేన్లు జాలువారి పనికిరాకుండా పోయాయి. పత్తికాయలు పగిలి మొలకెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో 50 శాతం సోయా పూర్తిగా పోయింది.

2.39 లక్షల హెక్టార్లకు పరిహారం

తెలంగాణలో గతేడాది వానకాలం సీజన్​లో వరదల వల్ల కలిగిన నష్టంపై  అంచనా కోసం ఐఎంసీటీ రాష్ట్రంలో పర్యటించింది. 2.39 లక్షల హెక్టార్ల లో 33 శాతం, అంతకన్నా ఎక్కువ పంట నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్​ ఆధారంగా సెంట్రల్​హైలెవల్​ కమిటీ మీటింగ్ లో రాష్ట్రానికి  రూ. 245.96 కోట్లను కేంద్రం అప్రూవ్​చేసింది. ఇందులో రూ. 188. 23 కోట్లను ఇన్ పుట్ సబ్సిడీ కోసం కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్​ చేసినట్లు ఇటీవల పార్లమెంట్​లో ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్​లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తాను ఎలాగూ పరిహారం ఇవ్వలేదు, కనీసం కేంద్రం ఇచ్చిన పైసలను కూడా రైతులకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు.

ఇన్​పుట్ ​సబ్సిడీ రాదు.. బీమా పరిహారం లేదు

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం పంట నష్టపోయిన రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సీజన్​లో ఇన్​పుట్​సబ్సిడీ కింద పరిహారం అందజేయాలి. కానీ టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తప్ప ఆ తర్వాత ఇన్​పుట్ సబ్సిడీ కింద రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ గడిచిన ఆరేండ్లలో ఎప్పుడూ జరగని నష్టం గతేడాది వానాకాలం సీజన్​లో రైతులకు జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్లే రిపోర్టులు పంపినా సర్కారు ఇన్​పుట్​సబ్సిడీ ఇవ్వలేదు. ఇక వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. ఫలితంగా పంట నష్టపోయిన రైతులకు కనీసం బీమా కంపెనీల నుంచి కూడా పరిహారం అందకుండా పోతోంది.

పరిహారం ఇస్తలేరు

నా పొలం 4 ఎకరాలు నీటి పాలైంది. పొలమంతా ఇసుకతో కప్పేసింది. నష్ట పరిహారం ఇస్తరేమోనని ఎదురుచూస్తున్నం. కేసీఆర్ వచ్చినంక ఒక్క ఏడాదే  పరిహారం ఇచ్చిండు. ప్రతీ యేడు పంటలు దెబ్బతింటూనే ఉన్నాయి. అయినా  నష్ట పరిహారం ఇస్తలేరు. 
- పెండ్యాల సంపత్, ముత్తారం, పెద్దపల్లి జిల్లా

ఏడాదవుతున్నా పైసా అందలే 

గత వానకాలంలో  భారీ వర్షాలకు బీమా కాల్వకు గండి పడి  నాలుగు ఎకరాల వరి పంట నీటిలో మునిగిపోయింది. రూ. 1.5 లక్షల వరకు నష్టపోయా. ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి పైసా పరిహారం అందలేదు.
- కృష్ణ, రైతు, వీపనగండ్ల, వనపర్తి జిల్లా 

లెక్కలు రాసుకుపోయిన్రు

నిరుడు మాకున్న నాలుగెకరాల్లో వరి, ఇంకో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న  పంటలు వేశాను. దాదాపు 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. కానీ భారీ వర్షాల కారణంగా ఎనిమిదెకరాల పంట నీట మునిగింది. చివరకు కూలీల ఖర్చులు కూడా చేతికి రాలేదు. గవర్నమెంట్ ఆఫీసర్లు లెక్కలు రాసుకుపోయారు తప్ప ఇంతవరకు పరిహారం కింద ఒక్క పైసా కూడా చేతికి అందలేదు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందిస్తే రైతులకు మేలు జరుగుతుంది. 
- సుంచు రాంబాబు, ముల్కనూర్, వరంగల్ అర్బన్ జిల్లా

Tagged Crop loss, Farmer, TS government compensate, input subsi, 20 lakh acres

Latest Videos

Subscribe Now

More News